రాష్ట్రీయం
కీచక హెడ్మాస్టర్

- విద్యార్థినులకు వీడియో కాల్స్ చేసి వేధింపులు
- డ్యాన్స్ నేర్పిస్తానంటూ వికృత చేష్టలు
- సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కామారెడ్డి కలెక్టర్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినులకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించసాగాడు. దీంతోపాటు నృత్యం నేర్పిస్తానంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు.
అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్ శరత్.. హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
లింగంపేట్ మండలం నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యం కారణంగా స్కూల్‌కు హాజరు కాలేకపోయాడు. రెండ్రోజుల కిందట తండ్రితో కలిసి స్కూల్‌కు రాగా.. ప్రధానోపాధ్యాయుడు దీప్లా రాథోడ్ రాముకి టీసీ ఇచ్చాడు. కాళ్లవేలా పడ్డా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాము మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉన్న రాముని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ధర్నా చేశారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలూ వెలుగులోకి వచ్చాయి. కరోనా లాక్‌డౌన్ వేళ.. ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో హెడ్‌మాస్టర్ విద్యార్థినుల ఫోన్ నెంబర్లు సేకరించారు. వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్‌ల పేరుతో పాఠశాలల పున:ప్రారంభం తర్వాత విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సమాచారం. విద్యార్థినులకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పిస్తా అంటూ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసింది. తన కోరిక తీర్చకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బాలికలకు భయబ్రాంతులకు గురి చేశాడు. బుధవారం దీనిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట బైటాయించారు. విచారణ అనంతరం కలెక్టర్ హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేశారు.
related stories
-
వృషభం వృషభం - 15, ఏప్రియల్ 2021
-
పొట్టి శ్రీరాములు నెల్లూరు బాలికలుఉన్నత చదువులు చదవాలి
-
తెలంగాణ తాజావార్తలు సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు