Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

క్రిప్టో స్కీమ్లో రూ.10 కోట్ల మోసం..

ప్రధాన నిందితుడి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ నవతెలంగాణ-ఆలేరు టౌన్
క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఆలేరు పట్టణానికి చెందిన వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడు ఎం.డి.

గౌస్ను వెంటనే అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు బుధవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.

రామంతాపూర్కు చెందిన ఎం.డి. గౌస్, అతని భార్య వజీద కలిసి యూనిటీ మెటా (యూనిటీ మేట) కంపెనీ పేరుతో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేసి, 2023 ఫిబ్రవరి నెల నుంచి ఆలేరు పట్టణానికి చెందిన దాదాపు 500 మంది వద్ద రూ 3 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు పెట్టుబడులు సేకరించారని తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు.

పెట్టుబడిదారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్ 2026 ఏప్రిల్ 10 నుంచి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆలేరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, రెండో నిందితురాలు (ఎ 2) వజీదను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు పంపగా, ప్రధాన నిందితుడు (ఎ 1) గౌస్ మాత్రం గత 100 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆలేరు బృందావని కాలనీలో సుమారు రూ.కోటి విలువైన భవనం నిర్మించడంతో పాటు పలు ప్లాట్లు, హైదరాబాద్లో అనేక స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ఆ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు వారి సొమ్ము తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, మోసానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ప్రకటన తెలిపిన వారిలో ఎం.డి. మహమూద్, బుషిగంపల శ్రీశైలం, సుంకరి ప్రదీప్, పల్లెకాడి శివ, బిట్కూరి రవి తదితర బాధితులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana