Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టిన 'జంతర్మంతర్'

కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టిన 'జంతర్మంతర్'

ప్రజాస్వామ్యంలో తిరుగులేని శక్తి ప్రజలదే. ఎంతటి పరాక్రమవంతమైన, బలమైన పాలనైనా ప్రజల ఆగ్రహ జ్వాలల ముందు, ముఖ్యంగా యువత చెలరేగించే ఉద్యమాల ముందు తలవంచక తప్పదు.

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగిన ఒక నెల రోజుల యువజన ఉద్యమం భారతదేశ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయాన్ని లిఖించింది. ముఖ్యంగా జూలై 20 నుంచి 25వ తేదీల మధ్య కొన్ని గంటల పాటు చెలరేగిన పెను ఉప్పెన, బహిరంగ నియంతృత్వం వైపు పయనిస్తున్న మోడి ప్రభుత్వానికి కోలుకోలేని గట్టిదెబ్బ కొట్టింది. ఈ పోరాటం కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది మాత్రమే కాదు. నిర్బంధం, అణచివేత, వ్యూహాత్మక కుట్రల నడుమ నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 'జెన్ జీ'తరం చేపట్టిన ఒక చారిత్రక ఉద్యమం. దేశంలో గత కొంతకాలంగా నెలకొన్న అణచివేత ధోరణులు, నిరుద్యోగం, నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు ఒక్కటయ్యారు. జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన కొద్ది రోజుల్లోనే ఒక ప్రభంజనంలా మారింది. పార్లమెంటును చుట్టుముట్టడం ద్వారా, దేశ రాజధానిలో తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు. ఈ పోరాటం కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి చిన్న, పెద్ద నగరంలో యువత వీధుల్లోకి వచ్చి సభలు, ప్రదర్శనలు నిర్వహించారు.

'రాజు దిగంబరంగా ఉన్నాడు' అనే ప్రసిద్ధ డానిష్ రాజు కథలాగే, పాలకవర్గాల అసలు స్వరూపాన్ని, వారి నైతిక దివాలాకోరుతనాన్ని యువత ప్రపంచం ముందు సజీవంగా ఆవిష్కరించింది.యువత ఉప్పెనలా విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర గందరగోళంలో పడింది. దర్బారుకు, దాని పరివారానికి, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం ఛిన్నాభిన్నమైంది. తీసుకుంటున్న ప్రతి చర్య వికటించడం, వేస్తున్న వ్యూహాలన్నీ విఫలం కావడం బాహాటంగా కనిపించింది. అర్ధరాత్రి వరకు మేల్కొని సోషల్ మీడియా రీల్స్ ద్వారా యువతను ఆకట్టుకోవడానికి మోడీ ప్రయత్నించగా, యువత ఆ దీన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మరింత వ్యంగ్యంగా, హాస్యభరితంగా రికార్డ్ చేస్తూ ఎగతాళి చేశారు. ఉద్యమ తీవ్రతకు తలవంచి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మరుసటి రోజే లోక్సభలో ఆయనకు ఘన స్వాగతం పలకడం, ఆయన స్థానంలో బిల్కిస్ బానో నిందితులను సమర్థించిన ప్రహ్లాద్ జోషిని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తన అహంకారాన్ని, సవాలు చేసే వైఖరిని ప్రదర్శించింది. ఈ కొత్తతరం పోరాటం పొరుగు దేశాల్లో జరిగిన తిరుగుబాట్ల కంటే చాలా భిన్నమైనది. విశిష్టమైనది. యువత ఎటువంటి భయం లేకుండా, వ్యంగ్యం, హాస్యం, మీమ్స్, పదునైన పంచ్ లైన్లతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. హిందుత్వ రూపంలో కార్పొరేట్ లాభాల పల్లకీని మోస్తున్న పాలకవర్గాల కుయుక్తులపై యువతకు పూర్తి స్పష్టత ఉంది. 2021 నవంబర్ 19న దేశ రైతులు ఏవిధమైన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారో, అదే ఉత్సాహాన్ని 2026 జూలై 25న దేశ యువత అంతకుమించిన తీవ్రతతో పునరావృతం చేసింది.

ఉద్యమాన్ని దెబ్బతీయడానికి, నిరసనకారులను మానసికంగా కృంగదీయడానికి పాలకవర్గాలు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు, మీడియా యంత్రాంగం రకరకాల కుట్రలకు పాల్పడ్డాయి.ఉద్యమం వెనుక చైనా, పాకిస్తాన్ హస్తం ఉందంటూ, విదేశీ నిధులు అందుతున్నాయంటూ మంత్రులు ఆరోపించారు. అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ తమ వద్ద అటువంటి సమాచారం ఏదీ లేదని ఖండించడంతో ప్రభుత్వ అబద్ధాలు బయటపడ్డాయి.'ఆర్గనైజర్' పత్రిక ఉద్యమ ఫొటోలను ప్రచురించి, దీనిని ఒక మతపరమైన లేదా ముస్లిం ఉద్యమంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. జంతర్ మంతర్ వద్ద ఆకలి తీర్చడానికి ఆహార పంపిణీ నిర్వహించిన వారిలో ఒకరిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం చేసింది. కేరళలోని బీజేపీ మేధో విభాగం అధ్యక్షుడు టీజీ మోహన్దాస్ యూట్యూబ్ ప్రసంగంలో అత్యంత నీచమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో పాల్గొంటున్న లౌకిక, వామపక్ష మహిళలపై సామూహిక లైంగికదాడులు, హత్యలు జరుగుతాయని బెదిరించడమే కాకుండా, కర్ఫ్యూ విధించి గుంపుపై కాల్పులు జరపాలని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమంలో పలువురు బీజేపీ నాయకుల కుమార్తెలు కూడా ఉన్నప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారి స్త్రీ ద్వేషాన్ని బహిర్గతం చేసింది. విమర్శలు వెల్లువెత్తడంతో మోహన్దాస్ తమ సభ్యుడు కాదని ఆర్ఎస్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జూలై 26న మాట్లాడే సమయంలో ''జెన్ జీ భావోద్వేగపరులు, పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుకరిస్తున్నారు'' అని వ్యాఖ్యానించడం ద్వారా యువతను, మహిళా విమోచన ఉద్యమాలను పరోక్షంగా క్రమశిక్షణ లేనివారిగా, పతనమైనవారిగా వర్ణించారు.

ఈ ఉద్యమంపై జరిగిన నిందారోపణల ప్రచారం కేవలం ఒక్కరి మనసులోని కుళ్లు కాదు. అది మనువాద భావజాలంలో భాగం. వినాశకరమైన రీతిలో లైంగికదాడిని ఒక రాజకీయ ఆయుధంగా వాడాలనే సిద్ధాంతానికి బీజం వేసిన సావర్కర్ ఆలోచనలను ఈ వర్గాలు పుణికిపుచ్చుకున్నాయి. జేఎన్యూ, జామియా మిలియా విశ్వవిద్యాలయాల విద్యార్థులను, మేధావులను, ముస్లింలను, రైతులను ఏవిధంగా అయితే దేశద్రోహులుగా ముద్రవేశారో, ఇప్పుడు 'జెన్ జీ' యువతపై కూడా అదే విషాన్ని చిమ్ముతున్నారు. సోషల్ మీడియాలో నిర్భయంగా మాట్లాడిన యువతీ యువకుల డేటాను బహిరంగపరచవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, వారిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారు. జేఎన్యూ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు, ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ను అరెస్టు చేసేందుకు సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయానికి పోలీసులు వెళ్లడం వారి పిరికిపంద ప్రతీకార చర్యకు నిదర్శనం.యువత సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఒంటరిది కాదు. జూలై 28, 29 తేదీలలో ఢిల్లీలో జరిగిన రైతులు, కార్మికుల భారీ సమావేశాలు యువజన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఐదేండ్ల క్రితం (2021 నవంబర్ 19) రైతులు సాధించిన విజయాన్ని, 2026 జూలైలో యువత మరింత తీవ్రతతో పునరావృతం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి నిరసన ఒక గుణపాఠం నేర్పుతుంది. తప్పుడు విధానాలను సరిదిద్దుకోవడానికి, ప్రజావ్యతిరేక నాయకులను తొలగించడానికి ఇటువంటి పోరాటాలు మార్గం సుగమం చేస్తాయి.

మూడ్ శోభన్, 9949725951

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana