Friday, 02 Oct, 4.46 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
లైంగిక దాడి అమానుషం

- యూపీలో అమ్మాయిలకు రక్షణ లేదు
- దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన
- ప్రభుత్వ, నిందితుల దిష్టిబొమ్మల దహనం
నవతెలంగాణ-విలేకరులు
''ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బీజేపీ పాలనలో ఆవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేదు. బాలికపై లైంగిక దాడి చేసి క్రూరంగా ప్రవర్తించి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. యూపీలో మహిళలకు రక్షణ కరువైంది. వరుస అమానుష ఘటనల నేపథ్యంలో సీఎం యోగి రాజీనామా చేయాలి'' అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
- ములుగు జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జిన్నా లచ్చయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత బహుజన ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని విపనగండ్ల, ఆత్మకూర్‌, నారాయణపేట జిల్లా టౌన్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. లైంగికదాడి ఘటనను నిరసిస్తూ సిద్దిపేట టౌన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
- యూపీ లైంగికదాడి ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి కొత్త బస్‌స్టాండ్‌ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి టౌన్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు.
- ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట లైంగిక దాడి నిందితుల దిష్టిబొమ్మ దహనం చేశారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌక్‌లో మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
- ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల నిరసనలు చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యూపీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్‌ సంఘం నాయకులు నిరసన తెలిపారు.
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌, ఐద్వా, దళిత సంఘాలు, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. చిట్యాల, హాలియా, మిర్యాలగూడలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
- కేవీపీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ నగర కమిటీల ఆధ్వర్యంలో ఎస్‌వీకే వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం, పీఓడబ్ల్యు, పీడీఎస్‌యూ, పీవైఎల్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top