Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

వతెలంగాణ - హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈ దేశంలో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు నాంది పలికిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ స్ఫూర్తితోనే పార్లమెంట్, అసెంబ్లీలలోనూ మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలన్నారు.

భారతదేశానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెలికాం విప్లవాన్ని పరిచయం చేసి ప్రపంచ పటంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానాలే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతానికి, గాంధీ కుటుంబానికి మధ్య దశాబ్దాల కాలంగా ఒక అవినాభావ సంబంధం ఉందని, అది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదని.. కుటుంబ సంబంధాల కంటే ఎంతో పవిత్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

కోట్లాది మంది ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి, సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ గడ్డపై తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలు గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని, సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana