Friday, 02 Oct, 4.46 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
మానవహక్కులను హరిస్తున్న యోగి సర్కార్

- వ్యకాస అఖిల భారత కార్యదర్శి వెంకట్‌
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఉత్తర ప్రదేశ్‌ లో దళిత మహిళలకు రక్షణ లేదనీ, మానవహక్కులను ఉల్లంఘిస్తూ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దళిత యువతి మనీషా వాల్మీకిపై యూపీలో అగ్రకుల యువకులు జరిపిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద యోగి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ రక్తం కారుతూ ఉన్న దశలో పోలీసు స్టేషన్‌కు వచ్చి తనపై లైంగికదాడి జరిగిందనీ, నాలుక తెగ్గోశారని సెప్టెంబర్‌ 20న మనీషా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఐదు రోజుల వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యక పోవడం దారుణమన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ లైంగిక వేధింపుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని విమర్శిం చారు. పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే మనీషా మరణించిందనీ, తక్షణం వారిపై హత్యానేరం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన మనీషా శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా తల్లిదండ్రులను, బంధువులను ఇంట్లో బంధించి అర్ధరాత్రి శవాన్ని పోలీసులు కాల్చివేయడం చూస్తే యూపీలో మానవ హక్కులు ఉన్నాయా? లేవా?

అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ బాధితురాలి పక్షాన నిలబడాల్సిన పోలీసులు, నేరం చేసిన వారివైపు నిలబడటం వల్ల రానున్న కాలంలో ఉన్నత వర్గాలకు చెందిన పెత్తందార్ల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని హెచ్చరించారు. ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.వెంకట్రాములు, బి.ప్రసాద్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్‌.శోభన్‌నాయక్‌ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబశివ, ఆర్‌.ఆంజనేయులు, ఆర్‌.రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top