Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు

మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు

రాన్పై యుద్ధ భయంతోనే..న్యూఢిల్లీ : చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2022 తర్వాత తొలిసారిగా బ్రెంట్ క్రూడ్ ఓ దశలో ఏడు శాతం పెరిగి బ్యారల్కు 126 డాలర్లకు పైగా పలికింది.

ఇరాన్పై యుద్ధానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అమెరికా సైన్యం దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు నూతన ప్రణాళికలను ఉంచింది. దీంతో యుద్ధం తప్పదన్న అనుమానాలతో చమురు ధరలు అటకెక్కి కూర్చున్నాయి. ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దాడులు చేసినప్పటి నుంచి చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. శాంతి చర్చలు నిలిచిపోవడంతో ఈ వారం ప్రారంభం నుంచే ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు కీలక హార్మూజ్ జలసంధి ఇప్పటికీ మూసే ఉండడంతో సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఆసియా వాణిజ్యంలో బ్యారల్ ధర ఒక దశలో 126.31 డాలర్లకు చేరినప్పటికీ యూరప్లో వాణిజ్యం మొదలైనప్పుడు బ్రెంట్ క్రూడ్ ధర తిరిగి 122 డాలర్లకు తగ్గింది. గల్ఫ్లో మరోసారి సైనిక చర్యలు ఊపందుకోవచ్చునని చమురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నప్పటికీ అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై గణనీయంగానే ప్రభావం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించేందుకు అమెరికా సన్నాహాలు చేసుకుంటోందని వచ్చిన వార్తల నేపథ్యంలో చమురు ధరలు బుధవారం ఆరు శాతం పెరిగాయి. కాగా 1970వ దశకంలో కంటే ఇప్పుడు చమురు మంటలు ఆసియాను ఎక్కువగా కుదిపేయవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

140 డాలర్లకు చేరొచ్చు : ఇరాన్ స్పీకర్ ఘలీబఫ్
తమపై ఆర్థిక ఒత్తిడి కోసం అమెరికా మంత్రి స్కాట్ బెస్సెంట్, అధికారులు ముందుకు తెస్తున్న నిరాధార సలహాల కారణంగానే బ్యారల్ చమురు ధర 120 డాలర్లు దాటిందని, బహుశా అది 140 డాలర్లకు చేరుకోవచ్చునని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఓడరేవులలో నౌకల రాకపోకలపై అమెరికా విధించిన దిగ్బంధం చమురు ఉత్పత్తిని తక్షణమే దెబ్బతీస్తుందంటూ కొందరు చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ఆశించిన విధంగా ఇప్పటి వరకూ ఒక్క ఇరాన్ చమురు బావి కూడా పేలలేదని ఎత్తిపొడిచారు. 'గత మూడ్రోజుల్లో చమురు బావులేవీ పేలలేదు. మనం దీనిని 30 రోజుల వరకూ పొడిగించి బావి పేలుడును ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు' అని ఘలీబఫ్ ఎగతాళి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana