Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతకు షాక్

మమతకు షాక్

ప్రతిపక్ష నేతగా టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 
కీలక పరిణామం
అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రెబల్ అభ్యర్థికి స్పీకర్ ఆమోదం

కోల్ కతా : ఫశ్చిమ బెంగాల్లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఘోరంగా ఓడిన మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే, తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ పశ్చిమ బెంగాల్ నూతన ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పక్షానికి భారీ షాక్ ఇస్తూ, స్పీకర్ రతీంద్ర బోస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించే ప్రత్యేక చాంబర్ తాళాలను కూడా రితబ్రత బెనర్జీకి స్పీకర్ అందజేశారు. అక్కడి అసెంబ్లీలోని తృణమూల్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తమకే ఉందని ఇంతకుముందు రితబ్రత వర్గం ప్రకటించింది. అనంతరం 58 మంది శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖలను రితబ్రత వర్గం స్పీకర్కు సమర్పించింది. తృణమూల్ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల బలం రితబ్రత బెనర్జీకి ఉండటంతో స్పీకర్ ఆయనను ప్రతిపక్ష నేతగా ఆమోదించారు. తృణముల్ తిరుగుబాటు వర్గానికి చెందిన సందిపన్ సాహా, శ్యూలీ సాహా, జావేద్ ఖాన్లను డిప్యూటీ లీడర్లుగా, రఘునాథ్గంజ్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ను చీఫ్ విప్గా స్పీకర్ కార్యాలయం ఆమోదించింది.

దెబ్బ మీద దెబ్బ.. మేయర్ రాజీనామా
శోభన్దేబ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పంపిన లేఖను బెంగాల్ స్పీకర్ పక్కనపెట్టారు. తిరుగుబాటు వర్గానికి ఈ పదవిని కేటాయించారు. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న షాక్ నుంచి కోలుకోకముందే, మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడైన కోల్కతా మేయర్ ఫర్హాద్ హకిమ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమతా బెనర్జీ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంతకాల ఫోర్జరీ వివాదంపై ఒకవైపు సీఐడీ దర్యాప్తు జరుగుతుండగానే, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తిరుగుబాటు వర్గం చేతుల్లోకి వెళ్లడంతో బంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

అభిషేక్ బెనర్జీపై ఫైర్
294 స్థానాలున్న బంగాల్ అసెంబ్లీలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 78 సీట్లకు పరిమితమైంది. ఇందులో 58 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు. వేరే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం తమకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 18వ బంగాల్ శాసనసభతో అభిషేక్ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదని రితబ్రత బెనర్జీ స్పష్టం చేశారు.
'అసెంబ్లీతో అభిషేక్ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రజలకు కూడా ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉండి ఉంటే, ఆయన 26 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండేవారు కాదు. బయటకు వచ్చేవారు. ఆయన్ను దొంగను కొట్టినట్లు ఆయనను కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత, ప్రజలు తన వైపు ఉన్నారని, కాబట్టి ప్రజలే తన భద్రతను చూసుకుంటారని అన్న అభిషేక్, తన భద్రతను పెంచాలని కోరుతూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం' అని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana