Sunday, 24 Jan, 1.20 am నవ తెలంగాణ

వ్యాసం
మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు

ఎట్టకేలకు జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయటం, అధికారం స్వీకరించటం పూర్తయింది. అయితే అది సాదా, సీదాగా పూర్తిగాలేదు. నవంబర్‌ 3న పోలింగ్‌ పూర్తైన దగ్గర నుంచీ అనేక ఉత్కంఠలు, ఉద్వేగాలు అమెరికాలో చోటుజేసుకున్నాయి. ప్రంపంచంలోనే ప్రజాస్వామ్యానికి మకుటంగా గొప్పలు చెప్పుకునే ఆ దేశం అసలు రంగు 'మేడిపండు' చందంగా బయటపడే ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ, తాను అధికారం వీడే సమస్యేలేదని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక ఆరోపణలు చేసారు. కోర్టుల్లో కేసులు వేసారు. వీధుల్లో ప్రదర్శనలు, ఉద్యమాలు నిర్వహించారు. చివరకు బైడెన్‌ ఎన్నికను లాంచనంగా ఖరారు చేయటానికి సమావేశమైన అమెరికా పార్లమెంట్‌ (క్యాపిటల్‌ హిల్‌ బిల్డింగ్‌) పైనే వేలాది మందితో దాడి జరిగింది. ఆ దాడిని స్వయంగా అధ్యక్షుడు ట్రంపే ప్రోత్సహించాడు. ఈ చర్యలు అమెరికా మిత్రదేశాలకు, వారి ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పే వంది మాగధులకు సంకటంగా మారాయి. స్వంత రిపబ్లికన్‌ సెనెటర్లే 10మంది ట్రంప్‌ చర్యలను నిరసిస్తూ ఆయన ఇంపీచ్‌మెంట్‌కు ఓటేశారు. సరే, ఎలాగైతేనేం బైడెన్‌ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకరం చేసేసాడు గాబట్టి ఇక అంతా సజావుగా సాగుతుందని భావించవచ్చా? అలా భావించలేం. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ అప్పటికపుడు కాకతాళీయంగా జరిగినవి కావు.
అమెరికాలో జాతి వివక్ష తిరిగి పేట్రేగుతున్నది. ప్రాయిడ్‌ హత్య తర్వాత 'బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌' అనే ఉద్యమం పెల్లుబుకింది. ఆ తర్వాత కూడా ట్రంప్‌ తన ఎన్నికల క్యాంపెయిన్‌లో శ్వేతజాతి ఆధిపత్యాన్ని బాగా రెచ్చగొట్టి ఎన్నికల లబ్దికోసం ప్రయత్నించాడు. ఆ విధంగా అమెరిన్‌ సమాజం నిట్టనిలువునా చీలి ఉంది. 2008 తర్వాత ఆవరించిన ఆర్ధిక సంక్షోభం నుంచి ఇంకా ఆ దేశం బయటపడలేదు. కోవిడ్‌ వల్ల ఆ సంక్షోభం మరింత తీవ్రమయింది. ట్రంప్‌ అసమర్థత, తెంపరితనంతో కోవిడ్‌ కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా 2కోట్ల 40లక్షలకు చేరాయి. 4లక్షల మంది పౌరులు చనిపోయారు. ఇప్పటికీ రోజూ 4వేల మంది చనిపోతున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడు బైడెన్‌ తన ప్రసంగంలో పదేపదే అమెరికన్‌ ప్రజల ఐక్యత గురించే మాట్లాడాడు. 'నేను అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిని. ఇప్పుడు మన ఐక్యత అన్నింటికంటే విలువైనది' అని ఆయన మాట్లాడటాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బైడెన్‌ తన మొత్తం ప్రసంగంలో అమెరికా అంతరంగికంగా ఎదుర్కొంటున్న దేశ సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడాడు తప్ప ప్రపంచ వ్యవహారాలు, రాబోయే కాలంలో అమెరికా వ్యూహాలు, ప్రాధామ్యాల గురించి మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా ట్రంప్‌ కాలంలో పదేపదే చైనాను కట్టడి చేయటానికి వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు కొనసాగించారు. చైనాను దిగ్బంధించటానికి దాని చుట్టూ ఉన్న దేశాలతో మిలటరీ ఒప్పందాలకు విశ్వ ప్రయత్నాలు చేపారు. తుదకు అమెరికా ఎన్నికల ప్రచారంలో సైతం ఇద్దరు అభ్యర్థులూ చైనాపై తాము ఎంత కఠినంగా వ్యవహరిస్తామో చెప్పి ఓటర్లలో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ముజేసుకోవటానికి ప్రయత్నించారు. చైనా కమ్యూనిస్టు పార్టీని శత్రువుగా బాహాటంగా నిందించారు. తాము అధికారంలోకి వస్తే దానిని కట్టడి చేయటమే ప్రధాన ఎజెండా అనేవిధంగా ప్రతిజ్ఞలు చేసారు. కానీ బైడెన్‌ తన అధ్యక్ష తొలి ప్రసంగంలో చైనా గురించి కనీస ప్రస్తావనైనా చేయకపోవటం ఎవరికైనా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా అల్లిన పద్మవ్యూహం 'ఇండోపసిఫిక్‌' 'క్వాడ్‌'లలో ముఖ్య భాగస్వామిగా పాత్ర వహిస్తున్న మన దేశ పాలకులకు ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదు. చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించకుండా అమెరికాను అడ్డుకుంటున్న అంశాలేమిటి? కొత్తగా ఆవిష్కృతమౌతున్న ప్రపంచపటంలో అమెరికా పాత్ర ఎలా ఉండబోతోంది. ఈ విషయాలేవీ పరిగణలోకి తీసుకోకుండా 'తొందరపడి ఒక కోయిలా... ముందే కూసిందీ...' అన్నట్లు, దేశ స్వాతంత్య్రానంతరం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మనం అనుసరించిన 'అలీన విదేశాంగ విధాన' సంప్రదాయాలను తుంగలో తొక్కి, అమెరికాకు జూనియర్‌ పార్టనర్‌గా అవతారమెత్తి అడ్డగోలుగా మిలటరీ ఒప్పందాలకు మన పాలకులు ఒడిగట్టారు. 'కాషాయ' పెద్దల దూరదృష్టిలేనితనం మనకు ఇప్పుడు ఏ విధంగా శాపంగా పరిణమించనున్నదీ పరిశీలించటం అవసరం.
ప్రస్తుతం ప్రంపంచ పురోగతిని, అభివృద్ధిని రెండు అంశాలు అడ్డుకుంటున్నాయి. మొదటిది కోవిడ్‌ వల్ల తలెత్తిన ఆరోగ్య సంక్షోభమైతే రెండోది అంతకు మందే ప్రారంభమై కోవిడ్‌తో తీవ్రరూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం. ఈ రెండు ఆటంకాలను సోషలిస్టు దేశాలు జయప్రదంగా అధిగమించగలుగుతున్నాయి. చైనా కోవిడ్‌ను కంట్రోల్‌ చేయగలగటంతో పాటు, లాక్‌డౌన్‌ కాలంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ఉత్తేజితం చేయగలిగింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ మైనస్‌ 4నుంచి 10శాతం దాకా 2020 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ కుంగుబాటును ఎదుర్కొంటుంటే, చైనా ఒక్కటే 2020లో కూడా 2.3శాతం అభివృద్దిని సాధించింది. ఇక భవిష్యత్తులో కూడా అమెరికా ప్రపంచాధిపత్యం, ఆర్ధికశక్తి మరింత బలహీన పడటం ఖాయమనీ, చైనా చాలా వేగంగా అమెరికాను ఆర్థికంగా అధిగమిస్తుందనేది దాదాపు ప్రపంచ దేశాలన్నీ అంగీకరిస్తున్న సత్యం. అందుకే చైనాను ఒంటరి చేయాలనీ, దానికి వ్యతిరేకంగా ఆర్ధిక, మిలటరీ కూటములు నిర్మించాలనే అమెరికా ప్రయత్నాలు ముందుకు సాగకపోగా అవి బెడిసికొడుతున్నాయి. అయినా ఇండియా మాత్రం అమెరికా మిలటరీ కుట్రలకు పావుగా మారి దేశ ప్రయోజనాలకు భంగం కలిగించబూనటం భాదాకరమైన విషయం.
2019 నవంబర్‌ 15న, 15 దేశాల మద్య ఆర్‌సిఇపి (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌) ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం జరిగింది. ఫ్రీ ట్రేడ్‌ అంటే ఎటువంటి సుంకాలు, ఆంక్షలు లేని స్వేఛ్చా వ్యాపారం అని అర్థం. ఈ ఒప్పందం చేసుకున్న 15దేశాలలో ఆగేయాసియా దేశాల (ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కాంబోడియా, పిలిఫ్పీన్స్‌ వగైరా) తోపాటు, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలున్నాయి. ఈ దేశాల జనాభా 220 కోట్లకు పైగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 30శాతం ఈ దేశాల్లో జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ జరిగిన అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియా ఖండంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిదింటిలో ఒక్క ఇండియా తప్ప మిగతా నాలుగూ - చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఇండోనేషియా - ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందంపై నిపుణుల చెప్పే అభిప్రాయాలేమిటంటే కోవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలకు ఇది టానిక్‌లాగా పనిజేసి ఈ ఒప్పందంలోని దేశాలన్నీ ఆర్ధికంగా వేగంగా అభివృద్ది అవుతాయి. అంతేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఫోకస్‌ యూరోపు నుండి ఆసియావైపు మళ్లటానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. అమెరికా బలహీన పడటాన్ని ఇది వేగిరం చేస్తుంది. ఇక్కడ విషయమేమంటే ఈ ఒప్పందంలోని దేశాలన్నిటిని చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టటానికి ట్రంప్‌ హయాంలో జరగని ప్రయత్నమంటూ లేదు. దక్షిణ చైనా సముద్ర వివాదాలను ఉపయోగించి వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా వగైరా దేశాలిన్నింటినీ అదేపనిగా రెచ్చగొట్టారు. ''క్వాడ్‌'' పేర ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో ఇటీవలనే మిలటరీ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయినా వీటన్నింటినీ పక్కనబెట్టి ''క్వాడ్‌''లోని జపాన్‌, ఆస్ట్రేలియాలతోపాటు, ఆగేసియా దేశాలు మొత్తంగానే ఈ ఒప్పందంలో చేరాయంటే దానర్ధం చైనాతో వారికి విభేదాలేమీ లేవని కాదు. విభేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చుతప్ప ఆపేరుతో ఆర్ధికంగా అజేయ శక్తిగా ఎదుగుతున్న చైనాతో శత్రుత్వం సరికాదనీ, ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలలో ఉంటేనే కోవిడ్‌ తదనంతర ప్రపంచంలో అభివృద్ది చెందగలమనే ముందుచూపే వారిని ఆ నిర్ణయాలకు పురిగొల్పింది.
ప్రపంచంపై పెను ప్రభావం కలిగించే ఇలాంటిదే మరో ఒప్పందం కూడా జరిగింది. డిశంబర్‌ 30న 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ చైనాతో 'పెట్టుబడుల సమగ్ర ఒప్పందం' చేసుకుంది. ఈ ఒప్పదం ద్వారా ఈ దేశాలన్నింటిలోకీ చైనా పెట్టుబడులు, చైనాలోకి ఆ దేశాల పెట్టుబడులు ఆంక్షలు లేకుండా ప్రవహించే వీలేర్పడింది. వాస్తవంగా చైనా పెట్టుబడులు ఇప్పటికే యూరోపియన్‌ దేశాలలో చాలా విస్తారంగా వ్యాపించాయి. ఇపుడు ఈ ఒప్పందం ద్వారా యూరప్‌ దేశాల పెట్టుబడులు చైనా మార్కెట్లోకి ప్రవేశించటం భారీగా జరగొచ్చు. కొన్ని సంవత్సరాలుగా వాణిజ్య యుద్దంలో చైనాను ఒంటరిపాటు చేయాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమిస్తుంది. చైనా నుండి పెట్టుబడులు ఉపసంహరించబడితే భారత్‌లోకి పెట్టుబడులు వస్తాయనే మన ఆశలు నెరవేరే అవకాశం ఉండదు. పైగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు చైనాకు వ్యతిరేకంగా 'క్వాధ్‌'లో చేరతాయనే భారత్‌ ఆశలుకూడా నెరవేరే అవకాశం లేదు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రమాణ స్వీకారం జనవరి 20న జరగనుండగా డిశంబర్‌ 30నే ఈ చైనా - ఇయు ఒప్పందం జరగటం కాకతాళీయంగా జరిగింది కాదు. 2020 చివరినాటికి ఒప్పందంపై సంతకాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్ణయించుకుని మరీ యూరోపియన్‌ దేశాలు ఆ విధంగా వ్యవహరించాయి. ఇందుకు జర్మనీ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మెక్రాన్‌ చూపిన పట్టుదల ముఖ్య కారణం. బైడెన్‌ తన దేశ భద్రతా సలహాదారుగా ఎంపిక చేసుకున్న జేక్‌ సల్లివాన్‌ ఈ ఒప్పందానికి వారం ముందు ఒక ప్రకటన చేసాడు. ఏమనంటే ''అధికారం స్వీకరించగానే మొదటి ప్రాధాన్యతతో యూరోప్‌ మిత్రదేశాలతో చర్చలను, ముఖ్యంగా చైనా ఆర్ధికపోకడలను అడ్డుకోవటానికి ఏం చేయాలో చర్చించటానికి మేము ఆసక్తిగా ఉన్నాం'' అని ప్రకటించాడు. అంటే దానర్ధం మేము అదికారం స్వీకరించేదాకా చైనాతో ఒప్పందానికి మీరు తొందరపడొద్దని ఇయు దేశాలకు చెప్పటమే. అయినా ఇయు దేశాలు చైనాతో ఒప్పందానికే సిద్దపడ్డాయి. అంటే దీనర్ధం ఏమిటి? అమెరికాతో అనేక వ్యవహారాలలో విసుగెత్తిన ఇయు దేశాలు 'వ్యూహాత్మకం'గా స్వతంత్రను పాటించదల్చుకున్నాయనేది స్పష్టం. ఆ దేశాలు అమెరికాతో కూడా స్నేహం నెరపినా చైనాను శత్రువుగా పరిగణించడానికి వారు సిద్దంగా లేరనేది వాస్తవం. ఈ ఒప్పందం వల్ల చైనాకు మరో ప్రయోజనమూ ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రపంచ దేశాలలో చైనా గురించి కరోనా వైరస్‌, జిన్‌జియాంగ్‌లో వురుగర్‌ ముస్లింల సమస్య, హాంకాంగ్‌, తైవాన్‌, టిబెట్‌ సమస్యలతో జరుగుతున్న దుష్ప్రచారాలకు అడ్డుకట్ట పడి దానికి విశ్వసనీయత పెరిగే అవకాశముంది.
చైనాపై ప్రపంచ దేశాలకు విశ్వసనీయత తగ్గుతోందనీ, ముఖ్యంగా అమెరికా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ ఆ దేశంలోంచి పెట్బుబడులు బయటకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్నున్న నేపథ్యంలో, చైనానుండి పెట్టుబడులు భారీగా బయటకొస్తాయనీ, అవి మన దేశంలోకి వచ్చే అవకాశాలున్నాయనీ అంంచనాలు కట్టిన మన విదేశాంగ విధాన పండితులు ఈ పరిణామాలను ఇప్పటికైనా నిశితంగా గమనించటం అవసరం. సరిహద్దుల సమస్యలపై మన ప్రయోజనాలపై ఏ మాత్రం రాజీపడకుండానే వాణిజ్యం, పెట్టుబడులు, ద్వైపాక్షిక సహకార రంగాలలో పొరుగు దేశాలతో సఖ్యత నెరపటం అవసరం.
చైనా నుంచి పెట్టుబడులు బయటకు రావటం సంగతలా ఉంచితే ఆ దేశంలోకే భారీగా పెట్టుబడులు ప్రవహించే విధంగా అంతర్జాతీయ పరిణామాలు ఒప్పందాలు జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి. చైనాను మిలటరీ పరంగా కట్టడి చేయటం సంగతలా ఉంచి కోవిడ్‌ తదనంతర ప్రపంచంలో అమెరికా శక్తి అంతకంతకూ బలహీనపడుతున్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఈ మునిగిపోతున్న ఓడనెక్కి మనం ఒడ్డుకు చేరతామనుకుంటే అది భ్రమే అవుతుంది. మన విదేశాంగ విధానం అమెరికాకు జూనియర్‌ పార్టనర్‌గా మారటమనేది మన మెడకు మనమే ఉచ్చు బిగించుకోవటం తప్ప మరోటి కాదు. మన కాషాయ పాలకులు ముఖ్యంగా విదేశాంగ విధాన సలహాదారులు ఈ విషయాలను ఎంత త్వరగా గ్రహిస్తే మన దేశానికి అంత మంచిది.

- తమ్మినేని వీరభద్రం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top