హోం
మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, వారికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో వివిధ జిల్లాలకు చెందిన గంగపుత్ర సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకున్న నాధుడే లేడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్య రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లలను, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే కేసీఆర్ ఆలోచన అని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్యకార సొసైటీలలో ఇతర వర్గాల వారు సభ్యులుగా ఉన్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకు మాత్రమే సభ్యత్వాలు కల్పించిన విషయాన్ని వివరించారు. వంశపారంపర్యంగా తాము చేపల వేటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నామని, గంగపుత్రులు ఉన్న చోట్ల ఇతరులకు సభ్యత్వాలు కల్పించవద్దని మంత్రిని పులువురు గంగపుత్రులు కోరారు.
దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అపారమైన నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆయా వర్గాలకు చెందిన మత్స్యకారులు తమ తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించిన ఎడల ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలను తీసుకుంటామని మంత్రి వారికి వివరించారు. ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన అనంతరం నూతన సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి వివరించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి గంగాపుత్ర సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
related stories
-
తాజావార్తలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట
-
తాజావార్తలు వాడీవేడిగా జడ్పీ సమావేశం
-
తెలంగాణ తాజావార్తలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే పథకాలు!