Tuesday, 17 Dec, 3.19 am నవ తెలంగాణ

హైదరాబాద్
మట్టి పొరల్లోకి వెళ్లి చూసినప్పుడే.. సాహిత్యానికి సార్థకత

తెలుగెత్తి జై కొట్టిన సాహిత్య సభ
నవతెలంగాణ-రాంనగర్‌
తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న తెలుగెత్తి జై కొట్టు అంతర్జాతీయ సదస్సు ముగింపు సభను తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర మాట్లాడుతూ.. దేశ పాలకులు తీసుకొస్తున్న నూతన చట్టాలతో భారత సమాజం అభద్రతా భావంలో ఉన్న సందర్భంలో ఈ సదస్సు నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు. మట్టి పొరల్లోకి వెళ్లి చూసినప్పుడే సాహిత్యానికి సార్థకత ఉంటుందని వివరించడమే కాకుండా ధిక్కార కవిత్వాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. తెలుగులోనే పాలన ఉండాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య టి గౌరీశంకర్‌ మాట్లాడుతూ.. ప్రజల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్లినప్పుడే భాష నిలబడుతుందన్నారు. అత్యధిక సాహిత్య సాంస్కృతిక సంపద కలిగిన ప్రాంతం తెలంగాణ అని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక సాహిత్య ప్రక్రియలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. సాహిత్యాన్ని కాపాడే దిశగా ఈ సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ.. పాలనలో మాతృ భాష కలిగి ఉండటం ప్రాథమిక హక్కు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల వాడుక భాషలో పనిచేయాలన్నారు. గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నేరపూరిత నిర్లక్ష్యం వలన తెలుగు భాష ఔన్నత్యాన్ని కోల్పోయిందన్నారు.పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల తెలుగు భాషకు కొంత మేరకు మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి తంగిరాల చక్రవర్తి ఆహ్వానం పలకగా అనంతోజు మోహన కృష్ణ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనంద చారి, నరహరి సలీమా, నస్రీన్‌ ఖాన్‌ ,తెలంగాణ సాహితీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.నరేష్‌, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమించాల్సిన తరుణం
నవతెలంగాణ-కల్చరల్‌రిపోర్టర్‌
తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ సాహితీ పండుగ చివరి రోజైన సోమవారం యువ పరిశోధక విద్యార్థుల పత్ర సమర్పణ 8వ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఆప్సర్‌ విద్యార్థులు నుద్దింశించి మాట్లాడారు. తెలుగు భాష ప్రమాద స్థితిలో ఉన్నదన్నది నిజమని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరీపై ఉందన్నారు. తాను పని చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో తెలుగు భాషపై పరిశోధన చేస్తున్న వారిలో ముగ్గురు విదేశియు లున్నారని వారిని తెలుగు భాష తియ్యదనం ఆకర్షించిందన్నారు. ఇదే యూనివర్సిటీల్లో 1950లో తెలుగు భాషపై తొలి పరిశోధన చేసిన వారు బద్రిరాజు కృష్ణమూర్తి అని గుర్తుచేశారు. ప్రపంచ మంతా తెలుగు రాష్ట్రల వైపు చూస్తొందని ప్రత్యేకించి తెలంగాణ సామాజిక, రాజకీయ, పోరాట చైతన్యంపై పరిశీలిస్తున్నారన్నారు. సప్దర్‌హష్శీ ప్రజా కళాకారుడిగా నటనా, సాహిత్యాన్ని ప్రజా చైతన్యం కోసం ఉపయోగించారన్నారు. ప్రస్తుత కవులు సాహితీ వేత్తలు హష్శీవలే హక్కులు పౌరసత్వం ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఎదిరునిలువాలన్నారు. తెలంగాణ సాహితీ మాత్రమే అట్టివారిని తయారు చేయగలదన్నారు.

సాహితీలోకానికి సందేశం..
కవిత్వం చదివితే అంతగా హాజరు కానీ శ్రోతలు యువ విద్యార్థుల పరిశోధక పత్రాల సమర్పణ కార్యక్రమానికి విశేషంగా హాజరు కావడం తెలంగాణ సాహితీలోకానికి గొప్ప సందేశాన్ని అందించింది. తెలంగాణ సాహితీ వినూత్న ప్రయోగం భవిష్యత్‌ తరాలకు ఉపయుక్తం. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారి జీవి చరిత్రలు ఉద్గంధంగా వెలువరించడం అపురూపం.
-ఎన్‌ వినయకుమార్‌,ఎస్వీకే కార్యదర్శి

బాధ్యతాయుతమైన అక్షరం రావాలి..
ఎత్తిపోతల పరిశోధన కాకుండా ప్రతి వారు తమ పరిశోధనలపై తనదైన ముద్ర ఎమిటో స్పష్టం చేయాలి. నేడు సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో యువ రచయితలు సమాజానికి దిశ నిర్ధేశం చేయగల శక్తిని సమకుర్చుకోవాలి. పరిశోధన అంటే ఓ పరిశ్రమ. ప్రతిఒక్కరీ నుంచి బాధ్యతయుతమైన అక్షరం వెలువడేలా తెలంగాణ సాహితీ మార్గదర్శనం వహించడంలో సందేహం లేదు.
-రంగస్థల ప్రయోక్త శాంతారావు

రచయితగా వ్యక్తి స్ధిరపడాలి..
భాష నేర్చుకున్నప్పటి నుంచి ప్రతి వ్యక్తిలోనూ రచయిత ఉంటారు. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావంతో రచయితగా మెరుగవుతాడు. సమాజాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే రచయిగా ప్రతి వ్యక్తి స్థిరపడి ప్రజోపకరమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చు.
-ముంజేటి రామారావు,కమెండో ఎడిటర్‌

కవులు గుర్తింపబడని శాసన కర్తలు..
వామపక్ష భావాలు కలవారు పార్లమెంటులో గానీ రాష్ట్రాల శాసనసభల్లోని గానీ లేకపోయి నప్పటికీ కవులు అనేవారు గుర్తింపబడని శాసన కర్తలు. సంక్లిష్టతతో కూడుకున్న సమాజాన్ని ప్రస్తుత పరిస్థితుల నుంచి దాటవేయకల్గినవారు చైతన్య
వంతులైన సాహితీ వేత్తలు.
- ఆనందచారీ, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి

స్ఫూర్తి నింపిన వీరతెలంగాణ నాటకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూమి కోసం...భుక్తి కోసం...వెట్టిచాకిరి విముక్తి కోసం 1946-51 మధ్య కాలంలో జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శించిన 'వీరతెలంగాణ' నాటకం సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు విచ్చేసిన ప్రతినిధుల్లో స్ఫూర్తి నింపింది. సీఐటీయూ రాష్ట్ర మహాసభల ప్రాంగణమైన కామ్రేడ్‌ తిరందాసు గోపీనగర్‌(వీఎన్‌ఆర్‌ గార్డెన్‌)లో వీర తెలంగాణ నాటకాన్ని ప్రజానాట్యమండలి బృందం ప్రదర్శించింది. ఆనాటి నిజాం పాలన నిరంకుశత్వాన్ని, విసునూరు దొర ఆగడాలను ఎత్తిచూపుతూ ప్రారంభమైన వీరతెలంగాణ పోరాటాన్ని కండ్లకు కట్టినట్టు చూపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొర, అతని బృందానికి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువను, దొరకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో అమరుడైన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని సజీవంగా చూపెట్టారు. దొరలను, నిజాం అనుచరగణాన్ని ఊర్ల నుంచి తరిమికొట్టే మహౌత్తర ఘట్టాన్ని ప్రతినిధులు కండ్లార్పకుండా వీక్షించారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయాన్ని చెబుతూ...నాటకాన్ని ముగించారు. నాటకం ప్రదర్శన సందర్భంగా కళాకారులు పాడిన పాటలు ప్రతినిధుల్లో స్ఫూర్తిని నింపాయి.

కులాంతర వివాహ రక్షణ చట్టం కల్పించాలి..
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు తగ్గలంటే.. కులాంతర వివాహలను ప్రోత్సహించి కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాలి. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న లైంగికదాడి, హత్యలలో బాధితులకు సమన్యాయం జరగడం లేదు. ఇటీవల జరిగిన దిశ, సమత కేసులే ఇందుకు నిదర్శనం. పాలకులు, ప్రభుత్వాలు మారాలి
- స్కైలాబ్‌ బాబు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కారద్యర్శి

కార్పొరేట్‌ సంస్థల్లో కార్మికులుగా చేతివృత్తి దారులు ..
రోజు రోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసా యం, చేతివృత్తులు సన్నగిల్లుతున్నాయి. చేనేత వృత్తి కనుమరుగవుతుంది. కల్లు గీసేటోల్లు , గొర్లు కాసేటోల్లు పని కోసం పట్నం బాట పడుతుండ్రు. వారంతా కార్పొరేట్‌ సంస్థల్లో కార్మికులుగా, కాపాలదారులుగా పని చేస్తున్నారు. వారందరి పక్షణ కూడా సీఐటీయూ పోరాటం చేయాలని కోరుతున్నాం.
-ఉడుత రవి, చేతి వృత్తిదారుల సమన్వయం కమిటీ రాష్ట్రనాయకులు

నిరుద్యోగ శాతం పెరిగింది..
పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లతో..దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. భవిష్యత్‌ కాలంలో యువత ఉద్య మాల్లో సీఐటీయూ పాల్గొనాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఐక్య ఉద్యమాలతో సమస్యలు పరిష్కరమవుతాయి.
-విజరు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు

కార్మిక, కర్షకులు ఐక్యపోరాటం చేయాలి
పాలక ప్రభుత్వాలు వ్యహరిస్తున్న తీరుపట్ల కార్మికులు, కర్షకులు ఐక్యం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రైతుల పండించిన పం టలకు గిట్టుబాటు ధర లభించక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పెరిగిన ధరకు అనుగుణంగా మద్దతు ధర కల్పించాల్సి ఉన్నప్పటికీ..పాలక ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. ఈ పోరాటల్లో కార్మికులు, కర్షకులు ఐక్యపోరాటం చేయాలి...
-టి.సాగర్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మహిళల ఉద్యమాలు శక్తి వంతమైనవి ..
స్వాతంత్రోద్యమంలో, తెలం గాణ సాయుధ పోరాటాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం వలన కూడా శక్తివంతుల య్యారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలను తిప్పికోట్టడానికి మహిళ లోకం సంఘటితమై ఐక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మహిళ కార్మికులపై అనేక దాడులు కొనసాగుతున్నాయి. అసంఘటిత, ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో మహిళలపై యాజమాన్యాల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. వీటీపై ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ దాడులను అడ్డుకోవడానికి అన్ని రంగాల మహిళాలు ఐక్యపోరాటం చేసి మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
- మల్లు లక్ష్మీ, ఐద్వారాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top