Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటా క్రూరత్వం

మెటా క్రూరత్వం

8వేల మందికి ఉద్వాసనలుతెల్లవారకముందే మెయిల్స్
ఫేస్బుక్ మాతృసంస్థ ఉద్యోగుల గుండెకోత


శాన్ఫ్రానిస్కో : రాత్రి పడుకునేటప్పుడు రేపు హ్యాపీగా ఇంటి నుంచే ఆఫీస్ పని చేసుకోవచ్చని అనుకున్నారు..

తీరా తెల్లవారుజామున కళ్లు తెరిచి ఫోన్ చూసుకునేసరికి జీవితం ఒక్కసారిగా అంధకారమైంది. ఫేస్బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా తన ఆఫీసుల్లో గందరగోళం జరగకుండా ఉండేందుకు ఆడిన వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రామా ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల పాలిట ఒక తీరని శోకంగా మారింది. సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తెల్లవారుజామున 4 గంటలకే ఉద్వాసనల మెయిల్స్ పంపడం టెక్ పరిశ్రమలో కార్పొరేట్ క్రూరత్వానికి అద్దం పడుతోంది. ముందస్తు సమాచారం లేకుండా కనీసం ఆఫీసు డెస్క్ దగ్గరకు వచ్చి వస్తువులను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
​ అంతర్జాతీయంగా దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్న మెటాలో ఈ ఒక్క దెబ్బతో 10 శాతం మంది అంటే దాదాపు 8,000 మంది రోడ్డున పడ్డారు. వీరిలో ఎక్కువ భాగం కంపెనీకి వెన్నుముక లాంటి ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాల వారే కావడం గమనార్హం. ఇంటి నుంచే పని అని చెప్పి.. లాగిన్ అయ్యే లోపే యాక్సెస్ కట్ చేసి చేతిలో తొలగింపు లెటర్ పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ ఏడాది చివర్లో మరికొన్ని తొలగింపులు కూడా ఉండొచ్చనే ఊహాగానాలు ఐటి వర్గాల్లో మరింత భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.
​ వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్న మెటా యాజమాన్యం మరోవైపు దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఐ విధుల్లోకి మార్చనున్నట్లు మెటా హెచ్ఆర్ చీఫ్ జానెల్లె గేల్ ఇప్పటికే ప్రకటించారు. తొలగింపుల విమర్శలను నీరుగార్చడానికి ఈ ఎత్తుగడ ప్రకటన చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.


తొలగింపునకు ఎఐ ఒక సాకు మాత్రమే
గూగుల్ డీప్మైండ్ సిఇఒ డెమిస్ ఆగ్రహం

​ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) విస్తరణ వల్ల భవిష్యత్తులో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో గూగుల్ డీప్మైండ్ సిఇఒ డెమిస్ హిస్సాబిస్ టెక్ సంస్థల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ ఐ/ఒ కార్యక్రమంలో అత్యంత క్లిష్టమైన కోడింగ్లను అభివృద్ధి చేసే జెమిని 3.5 ఫ్లాష్ మోడల్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇలాంటి అధునాతన మోడళ్లు రావడం వల్ల కోడింగ్ చేసే ఉద్యోగుల అవసరం తగ్గుతుందని అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు. చాలా టెక్ కంపెనీలు కేవలం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, ఖర్చులు ఆదా చేసుకోవడానికే ఎఐని ఒక సాకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ ధోరణిని ఆయన ఎఐ వాషింగ్గా అభివర్ణించారు. సరైన ముందుచూపు లేకపోవడం వల్లే పలు సంస్థలు డెవలపర్ల స్థానంలో ఎఐని తీసుకురావాలని చూస్తూ వేలాది మందిని రోడ్డున పడేస్తున్నాయని మండిపడ్డారు. ​ఎఐ సాంకేతికతను కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి వాడుకోవాలే తప్పా ఉద్యోగుల తొలగింపు కోసం కాదని డెమిస్ సూచించారు. కోడింగ్ రంగానికి ఎఐ మరింత మెరుగైన సాయం అందిస్తే.. తమ కంపెనీలోని ఇంజినీర్ల శ్రమ తగ్గి వారి మేధస్సుతో మరిన్ని కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయించే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. టెక్ హంగులతో ఖర్చులు తగ్గించుకోవడం కంటే.. మానవ వనరుల ఉత్పాదకతను పెంచడమే తమకు ముఖ్యమని పేర్కొంటూ.. ఎఐని కేవలం ఒక సహాయక సాధనంగానే చూడాలన్నారు. ఉద్యోగాలను మింగేసే రక్కసిగా మార్చవద్దని ఆయన టెక్ పరిశ్రమకు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana