Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ పొదుపు మాటల మర్మం

మోడీ పొదుపు మాటల మర్మం

మోడీ పొదుపు మాటల మర్మంపొదుపు గురించి పాలకుల విన్యాసాలు జూస్తుంటే ఈ సమయంలో సుందరయ్యగారు మన మధ్య ఉంటే ఎలా వుండేది అన్పిస్తున్నది. ప్రధానమంత్రి మోడీగారు, ఆయన అడుగుజాడల్లో నడిచే అనేకమంది ముఖ్యమంత్రులు పొదుపు మంత్రం జపించడం చూస్తే, పొదుపుపై వీరికి అకస్మాత్తుగా ఇంత సదభిప్రాయం/ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని ఆశ్చర్యం కల్గక మానదు.

పాలకుల మాటల వెనక మర్మాలు సుందరయ్య జీవితాన్ని, ఆయన ఆలోచనా సరిళిని అర్థంజేసుకుంటే మనకు ఇట్టే అర్థం అయిపోతాయి. సుందరయ్య జీవితం పొదుపుకు / నిరాడంబరతకు మారుపేరు. అవసరానికి మించి దేన్నీ ఇష్టపడరు. అది ఆయన జీవన విధానం. కొనితెచ్చిపెట్టుకున్నది కాదు. ప్రజలపట్ల బాధ్యతకు, ప్రకృతి వనరుల దుర్వినియోగంపట్ల విముఖతకు నిదర్శనం. జీవితాంతం ఆయన ధరించిన దుస్తులు, ప్రయాణానికి ఆయన వాడిన కాలినడక, సైకిలు, అవసాన దశలో అయిష్టంగా ఆయన వినియోగించిన అంబాసిడరు కారు గురించి జ్ఞాపకం చేసుకుంటే ప్రజలపట్ల, ప్రకృతి వనరుల వినియోగం పట్ల రాజకీయ నాయకులకుండాల్సిన బాధ్యతేమిటో, పొదుపు అంటే నిజమైన అర్థం ఏమిటో తెలుస్తుంది.

సుందరయ్య ఆచరించిన 'పొదుపుభావనకు, ఇప్పుడు మన పాలకులు ప్రజలకు ఉపదేశిస్తున్న 'పొదుపు మాటలకు ఎంత వ్యత్యాసం ఉంది. సుందరయ్య ఆచరించిన నిరాడంబరత, పొదుపైన జీవితం ప్రజలకు, ప్రకృతికి మేలుజేసే సంకల్పం నుండి వచ్చాయి. ఇప్పుడు మోడీగారు, ఆయన అడుగుజాడలో చంద్రబాబుగారు, వల్లెవేస్తున్న 'పొదుపుచర్యలు తమ బాస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జేస్తున్న నేరాన్ని కప్పిపుచ్చే దుర్బుద్ధి నండి వచ్చాయి. నేరంజేసింది ట్రంప్ అయితే, దానికి దేశప్రజలు శిక్ష అనుభవించాలని మోడీ, చంద్రబాబు చెప్పడమే వారి పొదుపు మంత్రం సారాంశం. బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్ళి శుభకార్యాలు జరుపుకోవద్దు, ఇంటి నుండి పనిచేయండి, విమాన ప్రయాణాలు తగ్గించుకోండి, నలుగురు కలిసి కారు వాడుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టును వాడండి, ఇందన వినియోగం తగ్గించండి. రసాయన ఎరువులు వాడే బదులు ప్రకృతి వ్యవసాయం చేయండి, ఇలా ప్రజలకు సలహాలిస్తున్నారు.

తామే పొదుపులో ముందున్నామని చెప్పుకోవడానికి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్య సగానికి తగ్గించాలని అధికారులకు ఆదేశించానని చంద్రబాబుగారు మీడియాలో ప్రముఖంగా వచ్చేట్టు చూకున్నారు. ఈ ప్రచారార్భాటమంతా ఇప్పుడెందుకు వచ్చింది. నిజంగా పొదుపు గురించి వీరికి అంత శ్రద్ధ ఉంటే ఇంతకు ముందు ఎందుకు జ్ఞాపకం రాలేదు? పొదుపు మీద వీరికంత ప్రేమ ఉంటే అది నిరంతర కార్యక్రమంగా జరిపి ఉండాలి. వారి రాజకీయ విధానంలో, జీవన విధానంలో అంతర్భాగమై ఉండాలి. వారు నిరంతరం చెట్టాపట్టాలసుకుని తిరిగే కార్పొరేటు సంస్థలు, పెద్దలు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎంత ఆర్భాటంగా, కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్నారో, ఈ పార్టీల నాయకులు, (కొద్దిమందిని మినహాయిస్తే) ఎంత ఆర్భాటంగా, విలాసవంతంగా విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారో వీరికి తెలుసు. వీరే స్వయంగా అనేక సందర్భాలలో వాటిల్లో పాల్గొంటున్నారు. అయినా వారికి పొదుపు గురించి ఉపదేశాలిచ్చిన దాఖలాలు లేవు. పాలకులకు నిజంగా పొదుపు మీద నమ్మకం ఉంటే కొద్దిమంది సంపన్నుల, కార్పొరేటు సంస్థల బొక్కసాలలో సంపద పోగుబడి, ఏంచెయ్యాలో పాలుపోక విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడాన్ని నిరోధించడానికి వారి దగ్గరి సొమ్మును పన్నుల ద్వారా సమీకరించి వుండేవారు.

చాలీచాలని ఆదాయాలతో, అత్తెసరు జీవితాలను గడుపుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు 'పొదుపు ఉపదేశాలు ఇచ్చేవారు కాదు. పొదుపు పాలకులకోసం కాకూడదు. పొదుపు ప్రజలకోసం, ప్రకృతికోసం కావాలి. సుందరయ్య నుండి మనం నేర్చుకోవాల్సిందిది. ఈ నెల పదవ తేదీన హైదరాబాద్లో పొదుపు చర్యల గురించి ప్రధానమంత్రి మోడీగారు, అనాలోచితంగానో, పొదుపు మీద ప్రేమతోనో మాట్లాడలేదు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి, వేయబోయే భారాలకు ప్రజలను సన్నద్ధంజేయడానికి, అందుకవసరమైన సాకులను చూపడానికే ప్రస్తావించారు. రోజులు తిరక్కుండానే వారి పొదుపు మాటల వెనకనున్న మోసం బయటపడింది. డీజిల్, పెటల్రో ధరలు మూడు రూపాయలు పెంచారు.
ఇప్పటి చమురు సంక్షోభం ప్రజలు దుబారాజేయడం వలన ఏర్పడింది కాదు. దీనికి మూలం పశ్చిమాసియాలో అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై జేస్తున్న యుద్ధంలో ఉంది. యుద్ధం మూలంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

45 రోజులపాటు నిరంతరంగా బాంబులు కురిపించిన అనంతరం కాల్పులు విరమణ జరిగినా అమెరికా తన దాడిని ఆపలేదు. షిప్ల రాకపోకలను అడ్డుకుంటూ దిగ్బందనం కొనసాగిస్తుంది. అందుకే చమురు దిగుమతిపై ఆధారపడే మనలాంటి దేశాలన్నింటికి ఇంధన కొరత ఏర్పడి ఇబ్బందులు కల్గుతున్నాయి. ఈ ఇబ్బందులను/సంక్షోభాన్ని అధిగమించడానికి షిప్ల రాకపోకలను నిరోధించే దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసి, శాంతి ఒప్పందాన్ని జేసుకోవడం పరిష్కారం. అందుకోసం అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావడం అత్యవసరం. ఇందుకోసం మోడీ ప్రభుత్వం కృషిజేయకుండా అమెరికా దౌర్జన్యానికి వత్తాసు పలుకుతుంది. దాడికి గురైన ఇరాన్ పక్షం వహించకుండా మొదటి నుండి అమెరికా, ఇజ్రాయెల్కు వత్తాసుగా నిలుస్తుంది. అమెరికాజేసిన నేరానికి మన దేశ ప్రజలను శిక్ష అనుభవించమని చెబుతున్నది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న బాధలకు, భారాలకు ట్రంప్ ఎంత కారణమో, మోడీ కూడా అంతే కారణం. బ్రిక్స్లోని అన్ని దేశాలు అమెరికా దాడిని ఖండించినా బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉండి యుద్ధ విరమణకు కృషిజేసే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నది మనం. ఇప్పటికైనా ఆపని చేయకుండా మనం విశ్వగురువులం అని రోజు భుజాలు ఎగరవేసుకుంటే, ప్రపంచ దేశాలలో చులకనవుతాం. ఇప్పటికైనా, కేంద్ర బిజెపి ప్రభుత్వం అమెరికాకు అడుగులకు మడుగులొత్తడం విరమించి ప్రపంచ దేశాలతో కలిసి శాంతి కోసం కృషిజేయాలి. అమెరికా దిగ్బంధనం ఎత్తివేసేట్టుగా ఒత్తిడిజేయాలి.

బి.వి. రాఘవులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana