Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిద్దాం

మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిద్దాం

- ఈ నెల 10న జైల్ భరో ను విజయవంతం చేద్దాం - సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పిలుపు
నవతెలంగాణ - అశ్వారావుపేట

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలోని కార్మికులు, కష్టజీవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు వినాయకపురం ప్రాజెక్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ, ప్రశ్నించే వారిపై నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను బలహీనపరిచే విధంగా నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని, వ్యవసాయ రంగంలో దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే ఆహార భద్రత చట్టంలో మార్పులు చేసి పేదలకు అందుతున్న 35 కిలోల బియ్యాన్ని రద్దు చేసి, వ్యక్తికి 7 కిలోల చొప్పున మాత్రమే ఇవ్వాలనే ప్రతిపాదనలు పేదరికాన్ని మరింత పెంచుతాయని విమర్శించారు.

స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని, కనీస వేతనాన్ని రూ.42 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వినాయకపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నందిత, హెచ్వీ దుర్గకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగమణి,వాణి, రత్న, శాంతి, వెంకాయమ్మ, సుజాత, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana