Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్ల కాగితాలతో రూ.13 లక్షల టోకరా

నల్ల కాగితాలతో రూ.13 లక్షల టోకరా

రూ.500 నోట్లుగా మారుస్తానంటూ మోసం.. నిందితుడి అరెస్ట్ బ్లాక్ పేపర్లు, రసాయనాలు స్వాధీనం గతంలోనూ నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడు
నవతెలంగాణ - అశ్వారావుపేట

నల్లటి పేపర్లను ప్రత్యేక రసాయనాలతో కడిగితే అవి రూ.500 కరెన్సీ నోట్లుగా మారతాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.13 లక్షలు కాజేసిన నిందితుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి మోసానికి ఉపయోగించిన బ్లాక్ పేపర్లు, రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం అశ్వారావుపేట సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రత్తిపాటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి అశ్వారావుపేటకు చెందిన మధుబాబును నల్లటి పేపర్లను కెమికల్స్తో కడిగితే అవి రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించాడు.

ముందుగా నల్లటి పేపర్ల కట్టలు ఇచ్చినందుకు రూ.11 లక్షలు, అనంతరం వాటిని కరెన్సీ నోట్లుగా మార్చేందుకు అవసరమైన రసాయనాల పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుని వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కత్తిరించిన సుమారు 20 వేల నల్లటి పేపర్లు, వాటిని కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించేందుకు ఉపయోగించిన రెండు రకాల రసాయనాల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలోనూ నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ చోరీ కేసుల్లో నిందితునిగా ఉన్నట్టు తేలిందని డీఎస్పీ తెలిపారు. బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపే మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు, ఎస్హెచ్ఓ ఎస్ఐ యయాతి రాజు, అదనపు ఎస్ఐ దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana