Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవాబుపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరం

నవాబుపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరం

స్థానికంగానే పట్టణ స్థాయి నాణ్యమైన విద్యకు మార్గంఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవకు ఫలితం
స్థల గుర్తింపునకు అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-నవాబుపేట

గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నవాబుపేట మండలానికి మంజూరైనందుకు మండలంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు మెరుగైన విద్య కోసం మహబూబ్నగర్, హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చిన విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో ఇక మండల కేంద్రంలోనే ఆధునిక విద్య అందుబాటులోకి రానుంది. పాఠశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, స్థానిక సర్పంచ్కు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఐఐటి, యంగ్ ఇండియా స్కూల్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్ వంటి పలు విద్యా ప్రాజెక్టులను సాధించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తీసుకురావడం ద్వారా నవాబుపేట విద్యారంగ అభివృద్ధికి మరో కీలక మైలురాయిని నెలకొల్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ భాషా ప్రయోగశాలలు, ఆధునిక గ్రంథాలయం, ఐటీ, కంప్యూటర్ విద్య, కోడింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పోటీ పరీక్షలకు పునాది విద్య, ఇండోర్ అవుట్డోర్ క్రీడా వసతులు వంటి ఆధునిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, బాలికలకు నాణ్యమైన విద్య స్థానికంగానే అందుబాటులోకి రావడంతో ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు బలమైన పునాది ఏర్పడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతూ నవాబుపేటను విద్యారంగంలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కీలక పాత్ర పోషించనుందనే ఆశాభావం మండల ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana