నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఢిల్లీ కోర్టు బుధవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 13మందికి వ్యతిరేకంగా సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక జడ్జి అజయ్ గుప్తా పరిగణనలోకి తీసుకున్నారు.
''పరీక్షల్లో పేపర్ లీక్లు, ఇతర అక్రమ వర్గాల వినియోగానికి సంబంధించిన క్రిమినల్ కేసుల'' విచారణ కోసం ప్రత్యేకంగా నియమించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిబిఐ ఇటీవల తన తుది నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చార్జ్షీట్పై గురువారం నుండి కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
అయితే మైనర్లైన సాక్షుల పేర్లను మీడియా ప్రచారం చేస్తోందని.. చార్జ్షీట్లోని కొన్ని అంశాలు కూడా నిరంతరం మీడియాలో వస్తున్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. కోర్టులో సమర్పించకముందే.. మీడియాలో ప్రచురితమవడం దిగ్బ్రాంతికరమని సిబిఐ పేర్కొంది. సాక్షుల పేర్లను మీడియా ప్రచురించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మీడియా ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలని కోర్టు సూచించింది.

