Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి నుంచే దళితబంధు

నేటి నుంచే దళితబంధు

- లబ్దిదారుల ఖాతాల్లో 10లక్షలు.. వాసాలమర్రిలో 76 కుటుంబాలకు..
- ఎర్రవల్లిలా.. అందరికీ కొత్త ఇండ్లు
- ఆలేరులో రూ.30 కోట్లతో దళిత రక్షణ నిధి : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-యాదాద్రి
దళిత బంధు పథకంలో భాగంగా నేటి నుంచే దళితుల అకౌంట్లో రూ.10 లక్షలు జమ అవుతా యని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ మేరకు వాసాలమర్రిలో తక్షణమే దళిత కుటుంబాలకు ఆ నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువన గిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి పర్యటనలో భాగంగా బుధవారం సీఎం కేసీ ఆర్‌ రైతు వేదిక నుంచి ఈ ప్రకటన చేశారు. దళితవాడల్లో కాలినడకన పర్యటించారు.

వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌ అందుతుందా.. అని వృద్ధులను పలకరించారు. గ్రామంలో మొత్తం 76ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం.. అందరికీ ఒకేసారి గురువారమే లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ నిధులను దుర్విని యోగం చేయకుండా ఉపాధి పెరిగే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల సొమ్ముపై పూర్తి బాధ్యత దళితులదేన న్నారు. ప్రతి లబ్దిదారుని వద్ద ప్రభుత్వం రూ.10వేలు తీసుకుంటుందని, వాటితో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని, ఈ రోజే జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. దళితులు అనారోగ్యం, ప్రమాదాలకు గురైనా ఈ రక్షణ నిధి నుంచే నిధులు కేటాయించాలని చెప్పారు.
పాడుబడినట్టు ఉన్న గ్రామాన్ని కొల్లగొట్టి కొత్త వాసాలమర్రి నిర్మించుకోవాలని సీఎం సూచించారు. గతంలో ఎర్రవల్లి గ్రామంలోనూ ఇండ్లు ఇలాగే ఉంటే.. మొత్తం పడగొట్టి కొత్త ఇండ్లు నిర్మించి ఇచ్చాం.. ఇక్కడా అలాగే నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి వాసాలమర్రి నుంచే ప్రారంభం కావాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం విఫలం కానివ్వొద్దని సూచించారు. పేదరికంతో దళితులు బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రం సిద్ధించడంతో అన్ని వర్గాలతో పాటు దళితుల దశ కూడా మారిందని చెప్పారు. దళిత సమాజం కోసం అంబేద్కర్‌ రిజర్వేషన్‌ తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వాల మూలంగానే దళితులు అణచివేత, వివక్షకు గురయ్యారని అన్నారు. దీన్ని అధిగమించడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత బంధు పథకంతో ప్రజల ముందుకు వచ్చిందని వెల్లడించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని చెప్పారు.సీఎం వెంట ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, శాసన మండలి మాజీ చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కలెక్టర్‌ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులు, కవులు, రచయితలు మిట్టపల్లి సురెందర్‌, సాయిచంద్‌, అంబటి వెంకన్న, అభినరు శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana