Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిద్ర పట్టడం లేదా..?

నిద్ర పట్టడం లేదా..?

ర్ధరాత్రి దాటినా మెలకువగానే ఉంటున్నారా.. ఫోన్ చూస్తూనో, పని చేసుకుంటునో నిద్రను వాయిదా వేస్తున్నారా.. ఇది దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు నిద్రసరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసు పనులు, ఇంటి పనులతో సతమతమవుతూ నిద్రకు దూరమవుతున్నారు. ఉదయాన్నే ఆఫీసుకు పరిగెత్తాలనే ఉద్దేశంతో రాత్రి ఎక్కువ సమయం మేల్కొని ఇంటి పనులు పూర్తి చేసుకునే మహిళలే ఎక్కువ ఉన్నారు. అయితే రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం వేళ మబ్బుగా, అలసటగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తరచూ జలుబు, దగ్గు లాంటి ఇన్​ఫెక్షన్లుకు దారితీస్తుందని అంటున్నారు. అలాగే జ్ఞాపకశక్తిపైనా కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందుకే రాత్రిపూట త్వరగా నిద్ర పోవాలంటే కొన్ని అలవాట్లును అలవరచుకోవాలి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం…

చాలా మంది మహిళలు ఇంటి పని అంటే తమ పనే అనుకుంటారు. అన్ని పనులు ఒక్కరే చేసుకుంటుంటారు. ఇదే అలవాటుగా మారి చివరకు నిద్రపోవాలన్నా నిద్రపట్టని పరిస్థితి వస్తుంది. దీని వల్ల శారీరకంగానే కాదు మానసికంగానే అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భర్త, పిల్లలకు ఇంటి పనులు కేటాయించాలి. ఏదో ఒక పని వారికి చెప్పి చేయించాలి. అప్పుడు మీకూ విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరుకుతుంది. సమయానికి నిద్రపోయే వీలు కలుగుతుంది. దీంతో పాటు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…

స్క్రీన్ సమయం తగ్గించండి
కొంతమంది నిద్రపోయే ముందు ఫోన్ చూసిగానీ నిద్రపోరు. అలాంటి వారు స్క్రీన్ సమయాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొబైల్, టీవీ లేదా లాప్​టాప్​ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలగదంటున్నారు. అందుకే నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండటంతోపాటు నిద్ర బాగా పడుతుందని సలహా ఇస్తున్నారు. నిద్రపోయే ముందు 30-60 నిమిషాల పాటు ఎలాంటి పరికరాలు వాడకుండా ఉండేలా సమయాన్ని కేటాయించుకోవాలని స్లప్ ఫౌండేషన్ అనే సంస్థ చెబుతుంది.

కాఫీలు వద్దు
సాయంత్రం వేళల్లో కెఫీన్​కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టైంలో కెఫీన్​ను స్వల్ప మోతాదులో తీసుకున్నా నిద్రపోవడం కష్టమవుతుందని, నిద్ర నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. అందుకే సాయంత్రం వేళలో కాఫీకి బదులుగా చామంతి, పుదీనా లేదా రూయిబోస్ వంటి హెర్బల్​ టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సహజంగా నిద్రపడుతుంది.

అతిగా తినొద్దు
పడుకునే ముందు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం లేదా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది. దీనివల్ల మీరు ప్రశాంతమైన నిద్రకు దూరమవుతారు. అందుకే రాత్రి భోజనాన్ని నిద్రపోయే సమయానికి కనీసం మూడు గంటల ముందు తీసుకోవాలని హావర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెబుతుంది. ఒకవేళ పడుకునే ముందు ఏదైనా తినాలనిపిస్తే కొన్ని బాదం పప్పులు లేదా ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం మంచిది.

తేలికపాటి స్ట్రెచింగ్
నిద్రపోయే ముందు తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరంలోని కండరాలలో ఒత్తిడి తగ్గి, నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సరిచేసి శరీరాన్ని గాఢనిద్రకు సిద్ధం చేస్తుంది. కనుక ఈ చిట్కాను పాటించి చూడండి.

పగటి నిద్రను నివారించడం
పగటిపూట కాసేపు నిద్రపోవడం మంచిదే. కానీ సాయంత్రం పూట ఆలస్యంగా పడుకుంటే మాత్రం.. రాత్రి నిద్ర పట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు సాయంత్రం నిద్రమత్తుగా అనిపిస్తే, పడుకునే బదులుగా నెమ్మదిగా నడవడం, తేలికపాటి రీడింగ్ లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినడం లాంటి చేయాలని సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువసేపు కునుకు తీయడం రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్లూ లైట్ ప్రభావం
మొబైల్, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు పడుకోవడానికి ఒక గంట ముందు ఇంట్లో వెలుతురును తగ్గించుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వార్మ్​ టోన్డ్ ల్యాంప్స్ లేదా బల్బులను ఉపయోగించాలని చెబుతున్నారు. ఇవి శరీరం రీలాక్స్ అవ్వడానికి సమయం ఆసన్నమైందని మెదడుకు సంకేతాలు ఇస్తాయని తెలియజేస్తున్నారు.

స్థిరమైన దినచర్య
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం ద్వారా శరీర సర్కాడియన్ రిథమ్​ను క్రమబద్ధీకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సమయానికి నిద్రపోతామని తెలియజేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana