Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నోస్టాల్జియా' కవుల పుట్టినిల్లు

'నోస్టాల్జియా' కవుల పుట్టినిల్లు

చాలామంది కవులు 'నోస్టాల్జియా నుండే పుట్టు కొత్తరు. గతం కొంతమందికి గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని పీడకల. ఇంకొంతమందికి తీపి అనుభూతి. మొదటిది మనిషి అచేతనం (unconscious)లోకి జారవిడిచిన జ్ఞాపకాలైతే, రెండవది ఉపచేతనం (Sub-conscious) లో వుండి ఎప్పటికప్పుడు ఉపశమనం కల్గించే సాధనం.

కవి 'కొలిపాక శ్రీనివాస్' రాసిన 'నాలో నేను బాల్యాన్ని వెతుక్కుంటున్నా.!' కవిత ఉపచేతన స్థితిలోని ఉపశమన అంశాల్ని నెమరేసుకుంటది. నెమరువేత ప్రధానంగా 'అమ్మమ్మ కథలు, తాతయ్య నవ్వులు, ఆటలు, పాఠశాల, పేదరికపు సంతోషాలు' మొదలైన పరిమితమైన భావనల చుట్టూ పరిభ్రమిస్తూ అపరిమితమైన సంతోషాన్ని కొన్ని క్షణాల పాటు అందించి నిట్టూర్పును ఆశ్రయిస్తది.

నోస్టాల్జియాలో స్పష్టమైన విభజన రేఖ కనిపించేలా 'కవిత్వ నిర్మాణం' సరళమైన రీతిలో గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేస్తూ వర్తమానతను దాటలేని అశక్తతతో గతాన్ని అమురుకోవడంతో పాటు పరిహార - పరిహార సంఘర్షణకు స్థానాన్ని పదిల పరుస్తది. ఇది గతంలోకి వెళ్లలేని, వర్తమానంలో బతకలేని స్థితిని తెలియపరుస్తది. 'ఉద్యోగం, సంపాదన, బాధ్యతలు, పిల్లలు' మొదలైన భావనల చుట్టూ వర్తమానతలోని సంఘర్షణను చెప్పే ప్రయత్నంలో వాటిని కంచెలుగా భావించి, దాటడానికి కవి 'నోస్టాల్జియా'ను ఆశ్రయించడం కనిపిస్తది. అనేక ఒత్తిడులు, బాధలు, కష్టాలు ఆ కాసింత సేపు మరుపుకు గురైతయి. మనోవికల్పాలకు 'నోస్టాల్జియా' సరిమైన ఔషధంలా పనికొస్తదని కూడా భావించచ్చు.

కథలనీడ, నవ్వుల వెలుగుతో పాటు మనసును గాలితో, ఉద్యోగాన్ని గడియారంతో, సంపాదనను బంధనంగా జీవితం తీపి చేదులా సాగటం మొదలైన పోలికలు సిద్ధప్రతీకలు (proved symbols) గానే కనిపిస్తయి. కవి వీటిని దాటుకుని సరికొత్త ప్రతీకల్ని సష్టించగలగాలి. అప్పుడే ఏ కవికైనా సొంత ముద్ర తన రచనల్లో కనిపిస్తది. ఎత్తుగడతోనే కవి తన కవితలోపలికి గుంజు కెళ్లగలగాలి. ప్రతీకవికి 'నొస్టాల్జియా' ప్రాథమికదశలోని కవితా వస్తువు. తనను తాను దాటుకుని సమాజంవైపు దష్టి సారిస్తే విశాలమైన వస్తుప్రపంచం కవిత్వమయం కావడానికి ఉవ్విళ్లూరుతూ కనిపిస్తది. ఏయే వస్తువుల్ని ఎలా స్వీకరించి, తిరిగి ప్రపంచానికి అందిస్తావనే దాన్ని బట్టి కవిత్వ స్థాయి నిర్ణయిచబడుతది. గతకాలపు కవుల మూస పద్ధతుల్ని ధోరణుల్ని పాటిస్తారా? తమవైన కొత్త మార్గాల్ని నిర్మిస్తారా! అనేది కవుల భవిష్యత్తును నిర్ణయిస్తది. వేలు చూపితే కొండను పాకగల సజన కారుడు 'కొలిపాక శ్రీనివాస్'కి శుభాకాంక్షలు.

నాలో నేను బాల్యాన్ని వెతుక్కుంటున్నా…!
నాలో నేను మళ్లీ వెతుకుతే..!
అమ్మమ్మ కథల నీడలో
తాతయ్య నవ్వుల వెలుగులో
నా బాల్యం మెల్లగా జారిపోయింది…!
అప్పట్లో ఆటే ప్రపంచం..
పాఠశాలే బాధ్యత..
మనసు మాత్రం గాలిలా
అడ్డులేని ఆకాశంలో విహరించేది…!
ఇప్పుడేమో…
ఉద్యోగం అనే గడియారం
ప్రతి క్షణం లెక్కపెడుతుంటే
సంపాదన అనే బంధనం
మనసును మెల్లగా కట్టేస్తోంది…!
పెళ్లి, పిల్లలు
బాధ్యతల వలయంలో
జీవితం తీపి చేదులా సాగుతోంది

జ్ఞాపకాలను చూడాలంటే
కళ్లకే కళ్లజోడు అవసరమయ్యింది
సమయం మనపై గెలిచిందనే
నిజమైన సాక్ష్యం ఈ నెరిసిన జుట్టు…!

ఇరుకైన గదుల్లో
డబ్బుల లెక్కల మధ్య
మనసు నలిగిపోతుంటే
ఆ రోజుల్లో పేదరికంగా బ్రతికిన
సంతోషం మాత్రం పుష్కలంగా ఉండేది…!

మనుషుల మధ్య దూరం
గోడల కంటే ఎత్తుగా పెరిగాయి
నాలో నేను మళ్లీ అన్నీ వదిలేసి
అడ్డుగా ఉన్న కంచెలను దాటి
ఆరుబయట ఆకాశం కింద పడుకొని,
చుక్కలు లెక్కబెడుతూ..
వెన్నెలలో తడుస్తూ…
నా బాల్యాన్ని
మళ్లీ ఒకసారి వెతుక్కుంటున్నా..!!

- బండారి రాజ్ కుమార్, 8919556560

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana