Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే రోజు యోగా డే.. నీట్ రీ-ఎగ్జామ్

ఒకే రోజు యోగా డే.. నీట్ రీ-ఎగ్జామ్

21న మధ్యాహ్నం వేళలో విద్యార్థులకు 'పరీక్ష‍' ఎండలపై వాతావరణ సంస్థల హెచ్చరికలువేడి తీవ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళనలు

న్యూఢిల్లీ
: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ వచ్చేనెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.

అయితే అదే రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉండటంతో ఉదయం స్లాట్ను యోగా కార్యక్రమాలకు కేటాయించారనీ, అందుకు పరీక్ష‍ను మధ్యాహ్నం సమయంలో నిర్వహించాల్సి వస్తోందని కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లక్ష‍లాది మంది విద్యార్థులు పరీక్ష‍ రాయాల్సి ఉండటంతో ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యంపై చర్చకు దారి తీసింది. ఈనెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష‍… పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో రద్దయిన విషయం విదితమే. విచారణలో లీక్ వ్యవహారం ఎన్టీఏ వ్యవస్థలో పని చేసే కొంత మంది వ్యక్తుల వరకూ వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుశ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న 22 లక్ష‍ల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం పడింది. విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ… మొదట పరీక్షను ఉదయం వేళలో నిర్వహించాలని భావించాం. అయితే యోగా డే కార్యక్రమాల కారణంగా అది సాధ్యపడలేదని చెప్పారు. 'విద్యార్థుల రవాణా, వాతావరణ పరిస్థితులు కీలకం. కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది' అని తెలిపారు. మే 19న జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించి, ఈసారి ఎటువంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

​విద్యార్థుల ఆరోగ్యం, ఎండలపై ఆందోళనలు
జూన్ నెలలోనూ తీవ్ర ఎండలు నమోదు కానున్నట్టు వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పరీక్ష‍ రాయబోయే విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మధ్యాహ్నం సమయంలో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. పరీక్ష రోజున అభ్యర్థులకు ఉచిత బస్సు సేవలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండాలని ఆదేశించింది.. విద్యార్థులకు ఓఆర్ఎస్ పానీయాలు అందించాలనీ, తగిన శానిటేషన్ సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇక గతంలో అమలు చేసిన కఠిన తనిఖీలు… షూలు, బెల్టులు, హెయిర్ క్లిప్ల పరిశీలన వంటి చర్యలను ఈసారి నిలిపివేయనున్నారు.

భారత్లో తీవ్ర ఎండలు
​ఇదిలా ఉండగా.. ఐఎండీ ఉత్తర భారత్లోని అనేక రాష్ట్రాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్లు జారీ చేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో మధ్యాహ్న సమయంలో 48.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ ప్రకారం మే నుంచి ఆగస్టు మధ్య ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు 62-80 శాతం వరకు ఉన్నాయని అంచనా. సాధారణంగా ఎల్నినో ప్రభావంతో భారత్లో తీవ్రమైన ఎండలు నమోదవుతుంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana