- ప్రతి గింజను వినియోగంలోకి తెచ్చే సాంకేతికత- బంచ్ను ఫైబర్గా మార్చి ప్రత్యామ్నాయ వినియోగం
- రైతు శ్రేయస్సే ఆయిల్ఫెడ్ ధ్యేయం
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఎలాంటి అక్రమాలు లేదా అవినీతికి తావు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ బాధ్యతలను ఈఎస్సీసీఐ (ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీల్లో పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధృవీకరణ వచ్చిన తర్వాతే కాంట్రాక్టర్లకు చెల్లింపులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
శనివారం అశ్వారావుపేటలోని పామాయిల్ పరిశ్రమను సందర్శించిన శ్రీకాంత్ రెడ్డి, నట్ మరియు ఆయిల్ రికవరీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన హార్డ్ బంచ్ సెపరేటర్ యంత్రాన్ని పరిశీలించారు. ఈ యంత్రం ద్వారా ప్రతి గింజను సేకరించి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, బంచ్ను డబుల్ ప్రెస్సింగ్ యంత్రం ద్వారా ఫైబర్గా మార్చి ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని వివరించారు. కర్మాగారం నిర్వహణలో మరింత సమర్థత కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అనంతరం నారంవారిగూడెంలోని నర్సరీని సందర్శించి మొక్కల నాణ్యతను తనిఖీ చేశారు. నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మొక్కల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ మొక్కల బెడదను పూర్తిగా నివారించేందుకు ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం, పామాయిల్ సాగు అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపుదలే ఆయిల్ఫెడ్ ప్రధాన లక్ష్యమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఆఫీసర్ శంకర్, అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమల మేనేజర్లు కార్తీక్, నాగబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

