పొలం నుంచి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే.. ఇప్పటికే తేమ శాతం, నాణ్యత పేర్లతో కోతలు విధిస్తున్నారని, ఇప్పుడు 'ప్యాడీ క్లీనర్ ఖర్చు' అంటూ మరో కొత్త భారం మోపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఒక్కో బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు అదనపు తరుగు వేస్తుండటంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా సహకార అధికారి వాలుయ నాయక్ ను నవతెలంగాణ వివరణ కోరగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు గరిష్టంగా 650 గ్రాములు మాత్రమే తరుగు తీసి 40.650 కిలోల వరకు మాత్రమే కాంటా పెట్టాలని స్పష్టం చేశారు. అంతకుమించి తరుగు వేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
అయితే ఇదే విషయంపై స్థానిక వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిని ప్రశ్నించగా, 'మేము 40.1 కేజీలు మాత్రమే పెడుతున్నాం' అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం బస్తాకు కిలోల కొద్దీ ధాన్యం కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల మాటలు ఒకలా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారం మరోలా ఉండటంతో రైతుల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
ఇంకా కొనుగోలు కేంద్రాల్లో అత్యంత కీలకమైన ట్రాక్ షీట్లు కూడా రైతులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం బరువు, తరుగు, తేమ శాతం వంటి వివరాలు నమోదయ్యే ట్రాక్ షీట్లు రైతులకు ఇవ్వకపోవడంతో అసలు ఎంత కోత విధించారో కూడా రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. ట్రాక్ షీట్లు ఇవ్వకుండా కొనుగోళ్లు నిర్వహించడం ద్వారా అక్రమాలకు తెరలేపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తరుగులపై ప్రశ్నించిన రైతులను కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, హమాలీలు కలిసి వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 'లారీలు లేవు', 'కాంటా ఆలస్యం అవుతుంది', 'మీ ధాన్యం తర్వాత చూస్తాం' అంటూ రోజుల తరబడి రైతులను కేంద్రాల వద్దే నిరీక్షింపజేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొందరి ధాన్యం వర్షాలకు తడిసి నష్టపోయినా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు.
జిల్లా కలెక్టర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 'కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితమా..?' అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, రైతులను దోపిడీ చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 'ప్యాడీ క్లీనర్' పేరుతో జరుగుతున్న అదనపు తరుగులను వెంటనే నిలిపివేసి, రైతులకు పూర్తి మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

