Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రో బాంబ్

పెట్రో బాంబ్

లీటర్కు సగటున రూ.3 పెంపుసీఎన్జీ కిలోకు రూ. 2 పెరుగుదల
పెట్రోల్, డీజిల్ పై ధరల బాదుడు
నోట్ల రద్దులానే
చమురు పిడుగు

తెలంగాణలో పెట్రోల్ పై రూ.3.39, డీజిల్పై రూ.3.26 వాత

ఏపీలో పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెంపు
దేశ ప్రజలపై మరో భారం మోపిన మోడీ సర్కారు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ బాదుడుకు ఉపక్రమించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3కు పైగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే సీఎన్జీ ధరలు కూడా కిలోకు రూ. 2 చొప్పున పెంచింది. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. దాంతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వీటి ధరలు మారాయి.

​ధరల పెరుగుదల ఇలా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజీల్లపై రూ.3కు పైగా ధరలు పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై రూ.3.39, డీజీల్పై రూ.3.26 వరకు ఎగబాకాయి. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.110.89, డీజీల్ ధర రూ.98.96కి చేరింది. పెరిగిన దరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 94.77 నుంచి రూ. 97.77కు పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ. 87.67 నుంచి రూ. 90.67కు ఎగబాకింది. కోల్కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13గా ఉంది. ముంబయిలో పెట్రోల్ లీటర్ ధర రూ.106.68, డీజిల్ రూ.93.14 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.95.25గా నమోదైంది.

​ఇతర రంగాలపై ప్రభావం : ఆర్థిక నిపుణులు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆయిల్ కంపెనీలపై భారం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రధాని మోడీ పొదుపు మంత్రం పాటించాలని చెప్పిన రెండు మూడు రోజుల్లోనే ఈ ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాం శంగా మారింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు, ప్రయాణ చార్జీలు పెరగడంతో పాటు దేశంలోని తదితర రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా 2024 మార్చి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పూ లేదు.

లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 2024లో పెట్రోల్, డీజిల్ రెండింటిపై లీటరుకు రూ. 2 చొప్పున కేవలం ఒక్కసారి మాత్రమే ధరల తగ్గింపు జరిగింది. మరో వైపు నయారా, షెల్ వంటి ప్రయివేట్ రిఫైనరీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో బ్యారెల్కు సగటున 69 అమెరికన్ డాలర్లుగా ఉన్న దేశ ముడి చమురు దిగుమతి ధరల సగటు, తర్వాతి నెలల్లో బ్యారెల్కు 113-114 అమెరికన్ డాలర్లకి పెరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana