Friday, 23 Apr, 2.48 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
పీఎఫ్ ఆఫీసులో పెన్షనర్లకు ఇక్కట్లు

- ఆఫీసులో అడుగు పెట్టనివ్వని వైనం
- ఫిర్యాదు పెట్టెలో వేయమంటున్నారు... పరిష్కరిస్తలేరు
- నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు
- రిటైర్డ్‌ ఉద్యోగుల పట్ల సిబ్బంది
దురుసు ప్రవర్తన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుండా రిటైర్డ్‌ ఉద్యోగులను రోజుల తరబడి అధికారులు తిప్పించుకుంటున్నారు. సమస్య పరిష్కారం కోసం సుధీర్ఘప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తే ఫిర్యాదుల పెట్టె చూపించి డాక్యుమెంట్లను అందులో వేయించి పంపించేస్తున్నారు. అట్లాగైనా సమస్య పరిష్కరిస్తారా? అంటే అదీ లేదు. నెలల తరబడి తిరిగినా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంటున్నది. ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ జర్నలిస్టులు అని కూడా చూడకుండా 'ఉన్నతాధికారులు చెప్పారు..లోనికి పంపించం' అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి పీఆర్వో దాకా అక్కడ అందరిదీ ఒకటే తీరు. హైదరాబాద్‌లోని బర్కత్‌పుర పీఎఫ్‌ ఆఫీసులో జరుగుతున్న తంతంగంపై కథనం.
హైదరాబాద్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి అనివార్య కారణాల వల్ల పెన్షన్‌ ఆగిపోయింది. దీంతో బర్కత్‌పురా పీఎఫ్‌ ఆఫీసుకు ఆరు నెలల కిందట వెళ్లాడు. 'కరోనా నేపథ్యంలో ఎవ్వరినీ లోనికి పోనివ్వడం లేదు...అక్కడున్నడ్రాప్‌ బాక్సులో దరఖాస్తు నింపి కాఫీలు జతచేసి వేసి వెళ్లండి' అని గేటు వద్ద ఉండే సిబ్బంది చెప్పారు. నిజంగానే సమస్య పరిష్కరిస్తారు కాబోలు అనుకుని అక్కడి సిబ్బంది చెప్పి నట్టే అతను దరఖాస్తు నింపి ఫిర్యాదుల పెట్టెలో వేసి వెళ్లాడు. నెల అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ఆఫీసుకు వెళ్లాడు. సేమ్‌ సీన్‌ రిపిట్‌. వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తుంటాయి కదా..తను జత చేసిన జీరాక్సులు ఎక్కడైనా మిస్‌ అయ్యాయే అని భావించి మళ్లీ కొత్తగా దరఖాస్తు ఫారం నింపి వేసి పోయాడు. రెండో నెలా అదే పరిస్థితి. 'అధికారుల వద్దకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది..ఒక్కసారి పోనివ్వండి' అని అతను వేడుకుంటే సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో మళ్లీ యథాతధంగా దరఖాస్తు ఫారం నింపి డ్రాప్‌ బాక్సులో వేసి పోయాడు. ఐదుసార్లయినా సమస్య పరిష్కారం కాకపోయేసరికి ఆ పెద్దమనిషికి అంతులేని కోపం పట్టుకు వచ్చింది. అక్కడున్న సిబ్బందికి తన పరిస్థితిని చెప్పినా లోనికి పోనివ్వకపోతే..'మనుషులు తిరిగితనే పని అయితలేదు.కాగితాల్లో రాసి వేస్తే మీరు సమస్య పరిష్కరిస్తా?' అంటూ వాగ్వాదం చేసి మరీ మూడో అంతస్తులోని అకౌంట్‌ ఆఫీసర్‌ని కలిసి తన గోడునంత వెళ్లబోసుకున్నాడు.'ఇప్పటిదాకా ఏమైందో అయిపోనివ్వండి. గతాన్ని మర్చిపోండి..డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌, బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, పాసుబుక్కు, ఫొటో, ఆధార్‌కార్డు, పెన్షన్‌ కాపీలను అప్లికేషన్‌తో పాటు ఇవ్వండి' అని సూచించారు. ఐదు సార్లు డ్రాప్‌ బాక్సులో వేసిన కదా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయో చూడండి సార్‌ అంటే లేదు..లేదు కచ్చితంగా తేవాల్సిందేనని మెలిక పెట్టారు. రేపు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు వచ్చి ఆఫీసులోపలికి పోవడానికి ప్రయత్నిస్తే మళ్లీ రొటీన్‌ సీన్‌. సో అండ్‌ సో మూడు ప్లోర్‌కు వెళ్లి నిన్న అధికారిని కలిస్తే ఇవి తేవాలని చెప్పాడు. తెచ్చాను. ఇచ్చి వస్తా అంటే వెళ్లేందుకు అసలే అనుమతి లేదు' అంటూ సెక్యూరిటీ సిబ్బంది అటకాయించారు. ఎలాగో నానా తంటాలు పడిన తర్వాత పీఆర్వో దగ్గరకు పంచాయతీ చేరింది. 'వాళ్లు అట్టనే చెబుతరు మా పరిధి మాకుంటంది. లోపలికి ఎవ్వరినీ రానివ్వొద్దు' అని ఆదేశాలున్నాయంటూ పీఆర్వో కూడా అడ్డుతగితే..కనీసం ఆ అధికారి నెంబర్‌ అయినా ఇవ్వండి అంటే తమ దగ్గర లేదని ఇవ్వలేదు. ఇప్పటికీ అతని పెన్షన్‌ సమస్య పరిష్కారం కాలేదు. ఇలా అక్కడకు పదుల సంఖ్యలో వస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు ఇంచుమించూ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. 'ఇక్కడ రెస్పాన్స్‌ సరిగాలేదు. గంటల కొద్దీ గేటు బయట నిలబడాలి. తమకు సంబంధించిన సెక్షన్‌కు బాధితులను ఒక్కసారి పంపితే సమస్యకు పరిష్కారం అవుతుందా? లేదా? ప్రాసెస్‌లో ఉందా? లేదా? లేకుంటే ఇంకేం కావాలి? అనే దానిపై స్పష్టత వస్తుంది' ఎందుకింత ఇబ్బంది పెట్టడం అని మరో రిటైర్డ్‌ ఉద్యోగి అన్నారు. పీఎఫ్‌ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వృద్ధులు గంటల తరబడి గేటు వద్ద ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఏమిటని ప్రశ్నిస్తే కరోనా అని సాకు చెబుతున్నారు. రిటైర్డ్‌ పర్సన్‌ అని కూడా చూడకుండా 'ఏరు అక్కడకు పో.. ఎందుకొచ్చినవ్‌... పో ఆడ కూసోపో..ఇక్కడనుంచి పో అనే మాటలేందీ? 30, 40 ఏండ్లు ఉద్యోగం చేసి చివరకు మా పెన్షన్‌ డబ్బులు తీసుకునేందుకు వస్తే ఈ పాట్లేంది? ఈ దురుసు ప్రవర్తనేంటి?' అంటూ ఓ రిటైర్డ్‌ జర్నలిస్టు వాపోయాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top