హైదరాబాద్ : చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. నేడే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (40), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (29), రుతురాజ్ గైక్వాడ్ (21) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ధనంజయ డిసిల్వా (40 నాటౌట్), చమిక కరుణరత్నే (12 నాటౌట్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా టి20ల్లో అరంగేట్రం చేశారు.

