Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం

మూడు ఏళ్లుగా నిలిచిన హెచ్ డిఎఫ్ నిధులసొంతంగా భరిస్తున్నామని డాక్టర్ల ఆవేదన
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నీటి వసతి, మౌలిక వసతులు కల్పించడానికి, టాయిలెట్లు చిన్నపాటి మరమ్మత్తులకు, వివిధ రకాల రిజిస్టర్లు నిర్వహణకు ప్రభుత్వం (హెచ్ డి ఎఫ్.) ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది.

కానీ గత మూడు ఏళ్లుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు సొంతంగా జీతం నుంచి ఖర్చు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అభివృద్ధి కమిటీలు ఉన్నాయి. అధ్యక్షులుగా ఆయా మండల పరిషత్ అధ్యక్షులు ఉండేవారు. ప్రస్తుతం వారి కాల పరిమితి ముగిసింది. దింతో ఆస్పత్రులను పట్టించుకునే వారు కరువయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలో 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొన్ని మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా పేర్లు మార్చారు.

ప్రతి ఏడాది ఆస్పత్రి డెవలప్మెంట్ కింద నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా లక్ష యాభై వేలు వస్తుండేవి. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించి, ఏఏ పనులకు ఖర్చు చేయాలని తీర్మానం చేసేవారు. గత మూడు ఏళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో ఆస్పత్రులలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజు రోజుకు వైద్య అవసరాలు పెరుగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుంది. మౌలిక వసతులు కల్పించడానికి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రచారం చేయడానికి ఫ్లెక్సీలు, సమావేశాల నిర్వహణ, టీ, టిఫిన్ ను ఖర్చులు, జనవరి-26, ఆగస్టు -15 జెండావిష్కరణ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆరోగ్య మహిళా బ్యానర్ ఖర్చులు తదితర ఖర్చులు విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నిర్వహణ ఖర్చులకు జీతం నుంచి ఖర్చు చేస్తున్నాము: డాక్టర్ స్వప్న, సామాజిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల
ఆస్పత్రుల నిర్వహణకు నిధులు రావడం లేదు. ఇంతకుముందు డ్యూటీ డాక్టర్ లక్ష రూపాయలు ఖర్చు చేశారు. తప్పని సరి పరిస్థితులలో చిన్నచిన్న అవసరాలకు జండా ఆవిష్కరణ, ఆరోగ్యపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రచారం చేయడానికి ప్లెక్సీలకు తాగునీరు, మౌలిక వసతులు నుంచి ఖర్చు చేస్తున్నాము. నేను రూ.70.వేలు ఖర్చు పెట్టాను.

ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలి: నాగరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి

గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కు. అలాంటి ఆసుపత్రులకు మూడేళ్లుగా నిధులు నిలుపుదల చేయడం సరైనది కాదు. దూర పల్లెల నుంచి ఆస్పత్రికి వస్తుంటారు. రోగులకు కనీసం త్రాగడానికి నీరు మౌలిక వసతులకు నిధులు చాలా అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు భరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana