Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే

వతెలంగాణ - ఆలేరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేది దళిత మాదిగ జాతి విద్యార్థి బిడ్డలేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ నాయకుల బతుకులు మారాయని, ప్రజల బతుకులు మారలేదని ఎమ్మార్పీఎస్, మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మేడి పాపయ్య అన్నారు.

ఆలేరు పట్టణంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అవయవస్తాం సాధనకై జిల్లా స్థాయి సదస్సు, ఎమ్మార్పీఎస్, క్రిస్టియన్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సంఘీ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడి పాపయ్య మాట్లాడారు.

తాతల ముత్తాతల కాలం నాడే ఎస్సీ కార్పొరేషన్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డిలకు, కోమట్లకు, ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు, పాలకుల విధానాలు అష్టదరిద్రంగా ఉన్నాయని, దళితుల బాధలు, సమస్యలను పట్టించుకోకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా లక్ష మంది దళితులతో హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను మరో మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శిస్తే క్షమాపణ చెప్పించామని అన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు నిబంధనలు పెట్టవద్దని కోరారు. దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులు ఎక్కడా అధైర్యపడవద్దని, ఎమ్మార్పీఎస్ మాదిగలు దళిత క్రైస్తవులకు అండగా ఉంటారని అన్నారు. ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు. ఎస్సీల జోలికి వచ్చి, బైబిల్, ఏసుప్రభువును అనవద్దంటూ చెబుతున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ వద్దకు ఒక క్రిస్టియన్ బృందాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. క్రైస్తవులు క్రిస్టియన్ మార్గాన్ని విడవవద్దని అన్నారు.

అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ మాదిగ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కేదాసు మోహన్, జాతీయ ప్రధాన కార్యదర్శి చింతబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ల రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బైరపాక నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి సాంఘి స్వామి, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసాగల్ల రమేష్, మీసాల ఉప్పలయ్య, పాస్టర్లు పీటర్ బాబు, ఏలియా, ప్రభుదాసు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana