వరంగల్
ప్రచార పరుగు..!

- పట్టభద్రుల వద్దకు ఎమ్మెల్సీ అభ్యర్థులు
- త్వరలోనే నోటిఫికేషన్
-అధికారికంగా ప్రకటించముందే రంగంలోకి పల్లా
- స్థబ్ధుగా కాంగ్రెస్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరుగులు తీస్తోంది. పట్టభద్రులను ఆకర్షించడం కోసం బరిలో ఉన్న వారంతా వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే మార్నింగ్ వాకర్లతో ప్రచారం మొదలు పెడుతున్నారు. కుల, బంధుత్వ ఆధారంగా పెద్దలను కలుస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం స్థబ్ధతను వీడడం లేదు. ఇక టీఆర్‌ఎస్ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం ప్రచారంలో తలమునకలయ్యారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పదవి గడువు మార్చి 29తో ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఐదు లక్షల మందికిపైగా పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈనెల 29 వరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది. వామపక్షాల అభ్యర్థి జయసారధిరెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఆయన ఇప్పటికే మూడు జిల్లాల్లోన్ని అన్ని మండలాల్లో పర్యటించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పని చేసే ఉపాధ్యాయులను కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించాలని కోరారు. ఆయన మాటలు పట్టభద్రులను ఆకట్టుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోపాటు ఉద్యోగాలు కల్పించకపోవడం, పీఆర్సీలో కాలయాపన, పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. వామపక్ష పార్టీలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ,
కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు ఆయనకు మద్దతిస్తున్నాయి. టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేస్తుండగా ఆయన కూడా మూడు జిల్లాలను చుట్టివచ్చారు. ఆయనకు ఇంకా ఏ పార్టీ మద్దతు లభించలేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక మాత్రం అండగా ఉంది. ఆయన కేసీఆర్ విధానాలనే టార్గెట్‌గా తీసుకున్నారు. తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీ జరుగుతోందన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కోదండరామ్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉద్యోగులను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. వారితోనే ఎక్కువ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న, రాణిరుద్రమ వంటి వాళ్లు ప్రచారంలో నిమగమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీ చేస్తుండగా ఆయన ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. అయితే విద్యాసంస్థల అధిపతులను కలవడంతోపాటు బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
స్థబ్ధత వీడని కాంగ్రెస్
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి గెలుపొందారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అన్నది సందిగ్ధంగానే ఉంది. అయితే కోదండరామ్‌కు మద్దతు ప్రకటించొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ప్రకటించకపోవడం, పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ శ్రేణులు సైతం ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నిరాసక్తతతోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
అధికారికంగా ప్రకటించముందే ప్రచారంలోకి..
ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం ప్రచారంలోకి దిగారు. ఓటర్ల నమోదు సందర్భంగానే సిబ్బందితో ఆన్‌లైన్ చేయించారు. ఇప్పుడు కొత్త జిల్లాల వారీగా జరిగిన సన్నాహాక సమావేశాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వేర్వేరుగా కలుస్తున్నారు. ఆయన విద్యాసంస్థల ఓట్లపై ఆధారపడ్డారు. అయితే కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో పని చేసే సిబ్బంది ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. వీరంతా ప్రభుత్వ సహాయాన్ని అర్జించారు. ఆర్ధిక ఇబ్బందులతో అనేక మంది చనిపోయిన పరిస్థితి. వీరంతా అధికార పార్టీ విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. యాజమాన్యాలు చెప్పినా వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇక వరంగల్‌లోని ప్రముఖ విద్యాసంస్థలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయి. పార్టీ శ్రేణులు ఎంత కష్టపడినా ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. అయిన్పటికీ పల్లా మాత్రం ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.