Dailyhunt
ప్రజా శ్రేయస్సు కోసమే 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు

ప్రజా శ్రేయస్సు కోసమే 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు

- పిల్లల సంక్షేమ, పర్యవేక్షణకు గ్రామ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు- ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి
- ముష్టికుంట్ల ప్రజాపాలన గ్రామసభలో అదనపు కలెక్టర్ పి శ్రీజ

నవతెలంగాణ - బోనకల్ : ప్రజా శ్రేయస్సు కోసమే 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే ముష్టికుంట్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ గ్రామ సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి శ్రీజ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న వివిధ పథకాలు, ప్రభుత్వం అమలు చేయబోయే వివిధ పథకాలను వివరించేందుకు గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

ప్రతి ఇంటికి 5 లక్షల బీమా కల్పించే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకం ప్రవేశ పెడుతుందని తెలిపారు.నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.వివిధ శాఖల ద్వారా గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా గ్రామసభలో చర్చ జరుగుతుందని ఆమె అన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పేరిట ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ తీసుకుందని అన్నారు. వైద్య శాఖ, రోడ్డు భద్రత, మహిళా సంక్షేమం, యువజన క్రీడా శాఖ, త్రాగునీటి సరఫరా, వ్యవసాయం వంటి వివిధ శాఖల ద్వారా జూన్ 12 వరకు వివిధ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహణ, గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పన, ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్ గుర్తించి అక్కడ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు దృష్టిలో ఉంచుకొని రాబోయే 5 సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ప్రాధాన్యత ప్రకారం ఎంపిక చేసుకోవాలని అధికారులకు సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా లబ్దిదారులకు లబ్ది చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.

గ్రామాలలో ఏఎన్ఎం, ఆశా, తల్లితండ్రులు, సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో గ్రామ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయాలని, బాల్య వివాహాలను అడ్డుకోవడం, పిల్లలందరూ చదువుకునేలా చూడటం, పిల్లలకు మంచి పోషకాహారం అందేలా చూడటం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.పాఠశాలల వద్ద కోతుల సమస్య పరిష్కరించడం కోసం దశల వారీగా సోలార్ ఫెన్సింగ్ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మన పిల్లల భవిష్యత్తు చాలా కీలకమని, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడవద్దని, బయట ఇచ్చే చాక్లెట్, చిరు తిండ్లను పిల్లలు తినకుండా అవగాహన కల్పించాలని అన్నారు.

అనంతరం గ్రామసభలో పంచాయతీ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన ప్రజల వివరాలు ప్రదర్శించి, లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ గ్రామసభలో ఎంపిడివో రురావత్ రమాదేవి, తహసీల్దార్ మద్దెల రమాదేవి, ఉప సర్పంచ్ అమరేసి సీతయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ సైదులు, ఎఇఓ మరీదు త్రివేణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana