Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలపై నిఘా?

ప్రజలపై నిఘా?

నిరసనకారులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైషన్తో ఏఐ కళ్లద్దాలుసాధారణ కళ్లద్దాల్లా కనిపించే మెటా స్మార్ట్ గ్లాసెస్
వాటితో రహస్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసే అవకాశం

వినియోగంపై తీవ్ర చర్చ భద్రతకు ఉపయోగపడే టెక్నాలజీతో పౌరుల స్వేచ్ఛకు ముప్పు
గోప్యత, నిరసన హక్కులపై పెరుగుతున్న ఆందోళనలు
కేంద్రంపై పౌర హక్కుల సంఘాల విమర్శలు

సాంకేతికత ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ఉద్దేశించినదే. కానీ అదే సాంకేతికతను భద్రత పేరుతో పౌరులపై నిఘా కోసం వినియోగిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదని పౌర హక్కుల కార్యకర్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు, ఫేషియల్ రికగ్నైషన్ (ముఖ గుర్తింపు) టెక్నాలజీ వినియోగాన్ని విస్తరిస్తున్న వేళ.. వాటిపై స్పష్టమైన చట్టపరమైన నియంత్రణలు, స్వతంత్ర పర్యవేక్షణ లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో సీజేపీ నిరసనల సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఏఐ స్మార్ట్ గ్లాసెస్ వ్యవహారం ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది.

న్యూఢిల్లీ : ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల సందర్భంగా విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ధరించి కనిపించారని వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పటికే జంతర్ మంతర్ పరిసరాల్లో వందలాది సీసీటీవీ కెమెరాలు ఉండగా.. కళ్లద్దాల రూపంలో ఉండే ఈ పరికరాలతో ఎవరికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీయడం, వాటిని ఏఐ ద్వారా విశ్లేషించడం ప్రజల గోప్యతకు ముప్పుగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెటా వంటి సంస్థలు రూపొందించిన ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సాధారణ కళ్లద్దాల్లాగే కనిపిస్తాయి. అయితే ఇవి కేవలం చూపును మెరుగుపరచే పరికరాలు మాత్రం కావు. వాయిస్ కమాండ్తో ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, కాల్స్ మాట్లాడడం, సందేశాలు పంపడం, సంగీతం వినడం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న వస్తువులు, ప్రదేశాల గురించి సమాచారం తెలుసుకోవడం వంటి అనేక పనులు చేయగలవు.

నిరసనకారులపై నిఘా, వేధింపులు
ఈ టెక్నాలజీ దుర్వినియోగమైతే పౌరులపై నిఘా, వేధింపులు, వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గ్లాసెస్తో సేకరించిన ఫొటోలు, వీడియోలను ఇతర ఏఐ వ్యవస్థలు, ప్రభుత్వ నిఘా వ్యవస్థలతో అనుసంధానం చేసి వ్యక్తులను గుర్తించే అవకాశం ఉందని గోప్యత హక్కుల కోసం పనిచేసే సంస్థలు, పౌర హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నిరసనల్లో పాల్గొనడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అదే సమయంలో పరీక్షల్లో అక్రమాలకు, గోప్యమైన సమాచారాన్ని రహ స్యంగా సేకరించడానికి, సినిమాల పైరసీకి, అలాగే అనుమతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేయడానికి కూడా ఈ గ్లాసెస్ను ఉపయోగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాంకేతిక నిఘాపై సుప్రీంలో పిల్
ఇటీవల ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనల్లో ఢిల్లీ పోలీసులు డీపీ-దృష్టి, ఇక్షణ నిఘా వాహనాలు, మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికిల్స్ను వినియోగించారు. వీటిలో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థ ప్రత్యక్ష సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి నేర చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించామని పోలీసులు తెలిపారు. నిరసనలు ముగిసిన తర్వాత జంతర్ మంతర్ వద్ద గతంలో నేర చరిత్ర ఉన్న 2,873 మందిని ఈ వ్యవస్థ ద్వారా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే ఇలాంటి నిఘా అనేది భారత రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణాల కింద ఉన్న సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘిస్తోందంటూ సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు ఎ.ఎ. రహీమ్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

జవాబుదారీతనం, 
న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం
దృష్టి లోపాలు ఉన్న వారికి మార్గదర్శనం చేయడం, ప్రయాణాల్లో సహాయపడటం, ప్రజా సౌకర్యాలను సులభంగా వినియోగించుకునేలా చేయడం వంటి సామాజిక ప్రయోజనాలు కూడా ఈ సాంకేతికత సొంతం. అయితే ప్రభుత్వం, పోలీసులు ఈ సాంకేతికత ప్రజా భద్రత, ఉగ్రవాద నిరోధం, నేరాల దర్యాప్తు వంటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నామని చెప్తున్నప్పటికీ.. పౌర హక్కుల సంఘాలు మాత్రం భద్రత అవసరమే అయినప్పటికీ అదే స్థాయిలో గోప్యత, జవాబుదారీతనం, న్యాయపరమైన పర్యవేక్షణ కూడా ఉండాలని అంటున్నాయి. లేకపోతే ప్రజల రక్షణ కోసం వచ్చిన ఏఐ సాంకేతికత, ప్రజలపైనే నిరంతర నిఘా పెట్టే సాధనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలొంటే చట్టపరంగా నియంత్రణ, పారదర్శక విధానాలు, గోప్యత రక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎదుటి వ్యక్తికి తెలియకుండానే రికార్డింగ్
ఈ గ్లాసెస్లో అమర్చిన కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ మోడళ్లు ధరించిన వ్యక్తి చూసే దృశ్యాలను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ప్రజలకు అందుబాటులో ఉన్న సమా చారాన్ని ఆధారంగా తీసుకుని వస్తువులు, ప్రదేశాలు, గుర్తింపు చిహ్నాలను విశ్లేషి స్తాయి. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు గ్లాసెస్పై చిన్న ఎల్ఈడీ లైట్ వెలిగేలా మెటా సెకండ్ జెనరేషన్ పరికరాల్లో ఏర్పాటు చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఆ చిన్న లైట్ను గమనించడం, షట్టర్ శబ్దం వినిపించడం చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఎదుటి వ్యక్తికి తెలియకుండానే రికార్డింగ్ జరిగే అవకాశం ఉంటుంది.

వినియోగదారుల గోప్యత ప్రశ్నార్థకమే!
గ్లాసెస్ వినియోగదారుల గోప్యత కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వీడన్ మీడియా కథనాల ప్రకారం… కెన్యాలో పనిచేస్తున్న మెటా కాంట్రాక్ట్ ఉద్యోగులు స్మార్ట్ గ్లాసెస్తో రికార్డు చేసిన వ్యక్తిగత, కొన్ని సందర్భాల్లో అత్యంత వ్యక్తిగత వీడియోలను కూడా పరిశీలించడం గమనార్హం. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తాయి. ముఖ గుర్తింపు సాంకేతికతతో కలిపి ఈ గ్లాసెస్ వినియోగం మరింత వివాదాస్పదంగా మారుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana