Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి గింజా ప్రజల ఆస్తే .

ప్రతి గింజా ప్రజల ఆస్తే .

డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాంనిజాయితీ మిల్లర్లకు పూర్తి రక్షణ
దశాబ్దకాలం సీఎంఆర్ వ్యవస్థపై సమగ్ర ఆడిట్కు ఆదేశం : ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పండే ప్రతీ వరి గింజా ప్రజల ఆస్తేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి రూపాయీని, ప్రతి గింజనూ వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో నిజాయితీగల మిల్లర్లకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీనిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం అప్పగింత వరకు జరిగిన ప్రతి లావాదేవీ, మిల్లర్ల వారీగా డిఫాల్ట్లు, పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ దర్యాప్తులు, న్యాయపరమైన చర్యలు, అమలు వ్యవస్థలను క్షుణ్ణంగా సమీక్షించి, భవిష్యత్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దకాలంగా జరిగిన ధాన్యం సేకరణ, సీఎంఆర్ బకాయిలు, ఎఫ్సీఐకి అప్పగించిన బియ్యం, జిల్లాలు, మిల్లర్ల వారీగా పెండింగ్ డిఫాల్ట్లు, రికవరీల పురోగతి, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం శిక్షలు విధించడం మాత్రమే కాదని, ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ధాన్యాన్ని, ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయిని తిరిగి రాబట్టడమేనని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిల్లో ఎక్కువ భాగం గత ప్రభుత్వ కాలంలో పేరుకుపోయినవేనని తెలిపారు. ప్రస్తుతం వాటి రికవరీకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. నగదు రూపంలో చెల్లింపులు, ధాన్యం తిరిగి అప్పగింత, నాణ్యమైన బియ్యం సరఫరా వంటి అన్ని మార్గాల ద్వారా గరిష్ఠ స్థాయిలో రికవరీలు సాధించే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. డిఫాల్ట్ మిల్లర్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పరిమిత గడువు కారణంగా ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయన్నారు. మిగిలిన ప్రతీ కేసుపై మిల్లర్ల వారీగా గడువు నిర్దారించి ప్రత్యేక రికవరీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చాలని ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లర్లకు అప్పగిస్తుందని, ఒప్పందం ప్రకారం నిర్దేశిత పరిమాణం, నాణ్యతతో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని గుర్తు చేశారు.' మిల్లర్కు అప్పగించే ప్రతి బస్తా ధాన్యం ప్రభుత్వ ఆస్తి. అది ప్రజల సొమ్ముతోనే కొనుగోలు చేసింది. అందులో ఒక్క గింజ దారి మళ్లినా అది తెలంగాణ ప్రజలకు నష్టం. ప్రభుత్వానికి రావాల్సిన ఒక్క టన్ను బియ్యం తగ్గినా ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడుతుంది' అని హెచ్చరించారు. ఎక్కువ మంది రైస్ మిల్లర్లు నిజాయితీగా ప్రభుత్వంతో కలిసి పనిచేశారని తెలిపారు. కొద్దిమంది మాత్రమే బియ్యం అప్పగింతలో జాప్యం చేయడం, ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించడం, ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు.

సీఎంఆర్ వ్యవస్థలో సమూల సంస్కరణలు
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సీఎంఆర్ నియంత్రణ ఉత్తర్వులను పూర్తిగా సవరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఒప్పంద నిబంధనలను మరింత కఠినతరం చేయడం, బ్యాంకు గ్యారంటీలను బలోపేతం చేయడం, డిఫాల్ట్లపై కఠిన శిక్షలు, అమలు వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందిస్తామన్నారు. పెండింగ్ రికవరీలు, ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలు, సివిల్, క్రిమినల్ కేసుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి, రికవరీలకు అడ్డంకిగా ఉన్న ప్రతి పరిపాలనా అవరోధాన్ని వెంటనే తొలగించాలని అధికా రులను ఆదేశించారు.క్యూఆర్ కోడ్తో గన్నీ సంచులు, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్, జియో ట్యాగ్ తనిఖీలు, రియల్ టైమ్ స్టాక్ రీకన్సిలియేషన్, ప్రొక్యూర్మెంట్-మిల్లింగ్-ఎఫ్సీఐ డేటాబేస్ల అనుసంధానం, ఎర్లీ వార్నింగ్ వ్యవస్థ, రిస్క్ ఆధారిత మిల్లుల ఆడిట్లు వంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టాలని సూచించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యంపై నిర్వహించిన తనిఖీలు, దాడులు, నమోదు చేసిన క్రిమినల్ కేసులు, రికవరీలు, న్యాయ పరమైన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించారు. మోసం, ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం, నమ్మకద్రోహం వంటి నేరాలకు ఆధారాలు లభించిన ప్రతి సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పదేపదే డిఫాల్ట్ చేస్తున్న మిల్లర్లపై బ్లాక్లిస్టింగ్ సహా కఠిన పరిపాలనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana