Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం

వతెలంగాణ -పరకాల: భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పరకాల ఆర్డివో డాక్టర్ కే.

నారాయణ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 21 ప్రకారం.. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత గడువుగా నిర్ణయిస్తూ ఈ సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా అన్ని దశలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం కింద జూన్ 15 నుండి జూన్ 24 వరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఫారాల ప్రింటింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆర్డివో వివరించారు. అనంతరం అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ప్రక్రియ జూన్ 25 నుండి జూలై 24 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ సర్వేలో బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలతో కూడిన 'ముందుగా నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను' రెండు ప్రతులుగా అందజేస్తారని, వాటిని ఎలా పూర్తి చేయాలో ఓటర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఒకవేళ సర్వే సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే, అధికారులు కనీసం మూడు సార్లు ఆ ఇంటికి వెళ్తారని, ఓటర్లు ఈ ఫారాలను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. బిఎల్ఓలు ఏయే రోజుల్లో ఏయే ప్రాంతాల్లో సర్వే చేస్తారనే వివరాలను ముందుగానే ప్రచారం చేస్తామని, ఓటర్లు ఫారాలు అందజేసిన వెంటనే వారికి రసీదు (అకనాలెడ్జ్మెంట్) ఇస్తారని తెలిపారు.

అంతేకాకుండా, ఓటర్లు తమ పేరు గానీ, లేదా తమ తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మల పేర్లు గానీ 2002 ప్రత్యేక ఓటరు జాబితాలో ఉన్నట్లయితే, ఆ వివరాలను కూడా ప్రస్తుత జాబితాలో నమోదు చేసుకోవాలని, ఈ విషయంలో బిఎల్ఓలు పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆర్డివో డాక్టర్ కే. నారాయణ సూచించారు. ఇంటింటి సర్వే ప్రక్రియ ముగిసిన తర్వాత జూలై 31, 2026న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.

ఈ ముసాయిదాపై జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6, చిరునామా మార్పు, తప్పుల సవరణల కోసం ఫారం-8 ఉపయోగించవచ్చని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని ఆర్డివో ప్రకటించారు. కావున, పరకాల నియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లందరూ బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకుని, ఈ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana