Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ర్గానిక్ పంటల సాగుపై దృష్టి పెట్టాలితాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేస్తాం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తాండూర్లో రైతు వారోత్సవాలు

నవతెలంగాణ-తాండూరు
రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 99 రోజుల 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఏర్పాటు చేశారు. ప్రకృతి పంటలు పండించిన లావణ్యరెడ్డితో కలిసి టీజీ ఆన్లైన్ యాప్ను మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. భూములను రక్షించి, ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. భూమిని ఏ రకంగా సంరక్షించుకోవాలో శాస్త్రవేత్తలు అవగాహన కలిపిస్తారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో రూ.90 కోట్ల మంజూరుతో కోట్పల్లి ప్రాజెక్టు తెచ్చారని తెలిపారు.

దేశంలో అత్యధిక పంటలు పండించేది తెలంగాణనేనని తెలిపారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి చొరవతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రైతులు ప్రకృతి పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఏఓలు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి పొలాల్లో ఏయే పంటలు వేయాలో అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. రైతు భరోసా, రైతుబీమా, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే రైతులు, పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, ఏఎంసీ చైర్మెన్లు, ఆత్మ కమిటీ చైర్మెన్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana