Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతుబాంధవుడు 'బోడేపూడి'

రైతుబాంధవుడు 'బోడేపూడి'

మార్క్సిస్టు ఉద్యమ నేతగా, ఆదర్శ రాజకీయ వేత్తగా, రైతు బాంధవుడిగా అత్యంత గౌరవ మన్ననలను పొందిన మహావ్యక్తి బోడేపూడి వెంకటేశ్వరరావు. మార్క్సిజంలోని సజీవసారాన్ని గ్రహించి లెనిన్ నిర్వచించినట్టుగా 'నిర్దిష్ట పరిస్థితుల - నిర్దిష్ట విశ్లేషణ' అనే అంశం ఆధారంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మార్పునకు కృషిచేసిన నాయకుడు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మార్క్సిస్టు పార్టీ ఉద్యమ విస్తరణలో తనదైన పాత్ర పోషించిన దిశాళి. పాలేరుగా జీవితాన్ని ప్రారంభించిన బోడేపూడి నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ సాయుధ పోరాట ప్రభావంతో కమ్యూనిస్టుగా మారారు. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చే పార్టీ రహస్య సమాచారాన్ని, పత్రికను సింగరేణి కాలరీస్ కార్మిక నాయకుడు కామ్రేడ్ శేషగిరిరావుకు కొత్తగూడెం వెళ్లి అందించేవారు. గ్రామంలోని అనేకమంది అరెస్టు కావడంతో తాను రహస్యంగా మద్రాసు చేరుకొని ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారు. తిరిగొచ్చాక నల్లమల గిరి ప్రసాద్, నల్లమోతు పిచ్చయ్యతో కలిసి మధిర తాలుకాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి బలమైన పునాది వేశారు. చిర్రా వూరి లక్ష్మి నర్సయ్య, మంచికంటి రాంకిషన్ రావు, కెఎల్ నరసింహారావు, పర్సా సత్యనారాయణ, టిబిఆర్ చంద్రం లతో కలిసి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) విస్తరణకు కృషి చేశారు, జిల్లా కార్యదర్శిగానూ దశాబ్దకాలం పనిచేశారు. 1985 నుంచి వరసగా 89, 94, ఎన్నికలలో మధిర అసెంబ్లీ నుంచి గెలుపొందిన బోడెపూడి 89నుంచి మరణించేవరకు శాసనసభలో సీపీఐ(ఎం) పక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగానూ విస్తృత సేవలందించారు.

ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పునః నిర్మాణంలో నేలకొండపల్లి రైతు మహాసభ తొలి అంకం. అది మొదట తుదిశ్వాస విడిచే వరకూ రైతాంగ ఉద్యమంలో ఆయన భాగస్వామి. గిట్టుబాటు ధరలు, పంటనష్టపరిహారం కోసం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రైతు నేత. సాగు నీటి అభివృద్ధికి సంబంధించి వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శాసనసభలో నొక్కి చెప్పేవారు. కరువు, వరదలతో పంటలు దెబ్బతిన్న సమయంలో విస్తృతంగా పర్యటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేవారు. జిల్లాలో దళిత గిరిజన రైతులు, సన్న చిన్న కారు రైతుల కోసం, వాగులు, ఏరులుపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయించారు. ఇప్పటికీ అవి ఉపయోగకరంగా ఉన్నాయి. వైరా రిజర్వాయర్ ఆయకట్టు ద్వారా రెండు పంటలకు నీరు అందించే ప్రయత్నం చేశారు. సాగర్ ఆయకట్టులో చివరి భూములకు సాగునీరు అందించేందుకు కాల్వలపై తన శరీరం సహకరించకపోయినా తిరిగి పంటలను కాపాడిన రైతు బాంధవుడు బోడేపూడి. 1950 దశకం ప్రారంభంలో వైరా కమిటీ స్కూల్ ఏర్పాటుకై పాటిబండ్ల సత్యనారాయణ, చింత నిప్పు నర్సయ్యలతో కలిసి పునాది వేశారు. కేవీసీఎం డిగ్రీ కళాశాల ఏర్పాటు తోపాటు జిల్లాలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. విద్యార్థి, యువజన సంఘాలను ప్రోత్సహించారు.

సహకార సంఘాల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారు. వైరా విశాల పరపతి సంఘం జిల్లాలో నేటికీ పెద్ద సంఘం గా రైతులకు సేవలు అందించటం వెనుక బోడేపూడి పాత్ర ముఖ్యమైనది. సాంస్కృతిక ఉద్యమంలోనూ తనదైన పాత్ర పోషించారు. ఆదర్శ వివాహాలు చేయించడం లో ఆచార్యులుగా ఉండేవారు. కళలు సాహిత్యం పట్ల ఆయన ఎంతో ఆసక్తి చూపేవారు. వరుస మూడు ఎన్నికల్లో మధిర శాసనసభ నియోజకవర్గం నుంచి ఓటమి చెందినా ప్రజలను అంటి పెట్టుకుని ఉండి సేవలందించిన బోడేపూడి తిరిగి వరుస మూడు ఎన్నికల్లో అదే స్థానంలో విజయం సాధించి అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 'మిషన్ భగీరథ'ను 1996లోనే నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి, వైరా రిజర్వాయర్పై సుజల స్రవంతిని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు ప్లోరైడ్ రహిత మంచి నీరందిం చారు.

బోడేపూడి సంతాపసభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వైరా ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీటితో పడుతున్న ఇబ్బందులు, ప్రజల అనారోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పట్టుపట్టి సుజల స్రవంతి సాధించారనీ చెప్పారు. అందుకే సుజల స్రవంతికి 'బోడేపూడి సుజల స్రవంతి'గా ప్రభుత్వం నామకరణం చేస్తున్నదని ప్రకటించారు. బోడేపూడి సుజల స్రవంతి నుంచి పన్నెండు మండలాల ప్రజలకు మంచినీరు సరఫరా అవుతున్నది. వైరు ధ్యాలు ఎన్నున్నా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా బోడేపూడిని గౌరవించేవారు. ఆయన 5 ఆగస్టు 1997న తాను కన్నుమూసే వరకూ ఎర్రజెండాను మోస్తూ ప్రజల్లో చెరగని ముద్రవేశాడు. ప్రజా సమస్యలు పరిష్క రించడంలో బోడేపూడి అనుభవాలను, మహ త్తర విలువల వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
(నేడు బోడేపూడి 29వ వర్థంతి)

బొంతు రాంబాబు, 9490098205

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana