Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రక్త'దాహం'

రక్త'దాహం'

భూమిని దోచుకుంటూ, వనరులను వశపర్చుకుంటూ, ప్రకృతిని నాశనం చేసుకుంటూ తీసుకొస్తున్న 'అభివృద్ధి' నమూనా చివరకు నీటిచుక్క కోసం ఒకరినొకరు చంపుకునే దారుణస్థితికి తీసుకొచ్చింది.

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలభై రెండు మంది చనిపోయారు. ఆఫ్రికాలోని చార్డ్ దేశంలో ఇటీవల జరిగిన ఈ విషాదం మానవ నాగరికత వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం. వాదీ ఫిరా ప్రావిన్స్లో ఉన్న ఒకే బావి స్థానికులకు ఆధారం. కాగా, దాహం తీర్చుకోవడానికి ఆ బావి వద్దకు వెళ్లిన కొంతమంది తిరిగి ఇంటికి రాలేదు. వారికోసం వెళ్లినవారు కూడా అక్కడే నెత్తుటి మడుగులో పడి ఉన్నారు. అక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది. తమకే ఈ నీళ్లు చెందాలని వారిపై దాడికి దిగారు. నీళ్ల కోసం ఇరువురి మధ్య మొదలైన చిన్న ఘర్షణ, క్ష‍ణాల్లో రెండు తెగల మధ్య యుద్ధంగా మారి గ్రామాలను రక్తంతో నింపింది. మరో 'పానీ' పట్టు యుద్ధానికి తెరదీసింది.

ఓవైపు సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష‍ విజయాలతో మానవ నాగరికత తనను తాను గొప్పగా చాటుకుంటున్న వేళ.. నీళ్ల కోసం మనుషులు కొట్టుకుని చావడం చూస్తే మనం అభివృద్ధి చెందుతున్నామా? లేదంటే తిరో గమనం వైపు పయనిస్తున్నామా? అన్న ప్రశ్నలు మనల్ని వేధిస్తాయి. ఒకప్పుడు ఆఫ్రికాలో ఇరవై ఐదు వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి, అతిపెద్ద మంచినీటి వనరుగా ఉన్న చార్డ్ జలాశయం పదిహేను వందల చ.కిమీకు తగ్గి, ఇప్పుడు దాదాపు అంతరించేపోయే దశకు చేరింది. వాతావరణ మార్పులు, అడవుల విధ్వంసం, నిర్లక్ష్య పాలన పాలన కలిసి కోట్లాది ప్రజల జీవనాధారాన్ని నాశనం చేశాయి. నీరు తగ్గిన చోట ఆకలికేకలు ఆరంభమయ్యాయి. అకలి కేకల నడుమ వలసలు పెరిగాయి. వలసలు పెరిగిన చోట ఘర్షణలు చెలరేగాయి. చివరకు చుక్క నీటి కోసం మనిషిని మనిషి చంపుకునే పరిస్థితులు వచ్చాయి. ఇదంతా చూస్తే రాబోయే యుద్ధాలు భూమికోసం, అధికారం కోసం కాదు, సహజ వనరుల కోసం జరుగుతాయా? అన్న సందేహం రాకమానదు.

యూనిసెఫ్ 2026 అంచనాల ప్రకారం, సాహెల్ ప్రాంతంలో యాభై శాతం గ్రామీణ జనాభాకు సురక్ష‍ితమైన తాగునీరు అందుబాటులో లేదు. పైగా పశువుల మరణాలు పెరగడం, వ్యవసాయ దిగుబడులు తగ్గడం అక్కడ నెలకొన్న భయంకరమైన కరువు పరిస్థితులకు నిదర్శనం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అక్కడి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ సంక్ష‍ోభానికి కారణాలు అన్వేషించలేదు. కానీ, ఇదంతా పెట్టుబడిదారి విధానాల ఫలితమేనన్న సంగతి మరువరాదు. కార్బన్ ఉద్గారాలకు ప్రధాన కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు ప్రకృతి విధ్వంసానికి బాధ్యత వహించకుండా, పేద దేశాల ప్రజలనే వాతావరణ విపత్తుల బలిపీఠంపై నిలబెడుతు న్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం సహజ వనరులను కట్టబెట్టడం వల్లే ఈ పరిస్థితులు పరిణమిం చాయి. ప్రకృతి సంపదను మార్కెట్ వస్తువుగా మార్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఇప్పుడు దాని మనుగడనే సంక్ష‍ోభంలోకి నెట్టింది.

ఈ నేపథ్యంలో భారత పరిస్థితులు కూడా ఏమ్రాతం భిన్నంగా లేవు. దేశంలో నీటి సంక్ష‍ోభం వేగంగా ముదురుతోంది. ప్రధాన నగరాలు భూగర్భజలాల కొరతను ఎదుర్కొంటున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో వరుస ఎండలు రైతాంగాన్ని త్రీవంగా దెబ్బతీస్తున్నా యి. బోర్లు ఎండిపోవడం, చెరువులు కనుమరుగవడం, సాగునీటి కొరత ఏర్పడటం వల్ల గ్రామీణ జీవితం సంక్ష‍ోభంలోకి జారుతోంది.అయినప్పటికీ కేంద్రసర్కార్ 'ఇది వేసవికాలంలో మామూలే కదా' అన్న ధోరణితో వ్యవహరిస్తోంది. సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించే దిశగా సమగ్ర విధానాలను రూపొందించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.

ఓవైపు 'సార్ట్సిటీలు', 'అభివృద్ధి కారిడార్ల' పేరుతో వేల ఎకరాల పచ్చని భూములను అదానీ,అంబానీలాంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న బీజేపీ సర్కార్, ఆ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పేదలను మాత్రం విస్మరి స్తోంది. జల సంరక్ష‍ణ, చెరువుల పునరుద్ధరణ వంటి అందమైన ప్రకటనలతో ఊదరగొడుతున్నా వాస్తవ పరిస్థితి పాలకుల డొల్లతనాన్ని బయట పెడుతున్నది. ఇప్పటికే అనేక నగరాల్లో తాగునీటి సరఫరా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఇది భవిష్యత్తులో నీటిని డబ్బులున్న వారికే అందుబాటులో ఉండే వస్తువుగా మార్చే ప్రమాదాన్ని పెంచుతోంది. హైదరాబాద్ లాంటి మహా నరగంలో ఒక సామాన్య కుటుంబం నీళ్ల కోసం కూడా నెలకు రూ.రెండు దాకా వెచ్చించాల్సి రావడం బాధాకరం. పాలకవర్గాలు నీటి సమస్యను ప్రజాహక్కు కోణంలో చూడకుండా, ప్రయివేటీ కరణ కోణంలో చూడటమే ఈ ముప్పునకు కారణం. నీటి సంక్ష‍ోభం కేవలం ప్రకృతి సమస్య కాదు, అది సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులతో ముడిపడిన అంశం. నీటిని మార్కెట్ శక్తులకు వదిలేస్తే చివరకు జీవన హక్కునే కోల్పోతాం. ఇప్పటికైనా పాలకవర్గాలు మేలుకోల్కోకపోతే చార్డ్ దేశంలో వచ్చిన పరిస్థితి మనదేశంలోనూ రాకమానదు. అప్పుటు రేపటి తరాలు చరిత్రను ఇలా రాయాల్సి వస్తుంది- ''మనిషి చంద్రుడిపై కాలుమోపాడు…కానీ భూమిపై నీటిచుక్కను కాపాడుకోలేక తనను తానే నాశనం చేసుకున్నాడు.''




Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana