Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రెడ్ జోన్' వైపు ప్రపంచ చమురు మార్కెట్లు

'రెడ్ జోన్' వైపు ప్రపంచ చమురు మార్కెట్లు

రోజుకు 1.4 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరాకు అంతరాయంపరిస్థితి మరింత దిగజారితే జులై-ఆగస్టు నాటికి తీవ్ర సంక్ష‍ోభం : ఐఈఏ హెచ్చరిక
న్యూఢిల్లీ
: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం భారాన్ని యావత్ ప్రపంచం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మార్చి 4 నుంచి హార్ముజ్ జలసంధి మూసివేత కావడంతో రోజుకు సుమారు 1.4 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా మార్కెట్కు అందడం లేదు. పరిస్థితి మరింత దిగజారితే జులై-ఆగస్టు నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర సంక్ష‍ోభంలోకి వెళ్లొచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లాయని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే వేసవి కాలంలో చమురు కొరత మరింత పెరిగి మార్కెట్లు రెడ్ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో రోజుకు సుమారు 14 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయిందని ఐఈఏ తెలిపింది.

లండన్లోని చాతమ్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడిన ఫతిహ్ బిరోల్… ప్రపంచ చమురు నిల్వలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పెరుగుతోందన్నారు. వేసవి సెలవుల ప్రయాణాలు, పారిశ్రామిక కార్యకలాపాల పెరుగుదల కారణంగా చమురు వినియోగం మరింత అధికమవుతోందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని 'పూర్తిగా, ఎలాంటి షరతులూ లేకుండా' తిరిగి తెరవడమే ఈ సంక్షోభానికి ప్రధాన పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే సభ్య దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను మరింత విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మార్చిలో కూడా ఇదే విధంగా నిల్వల విడుదల చేపట్టినట్టు గుర్తు చేశారు.

​గత సంక్ష‍ోభాల కంటే తీవ్రం
ఈ సంక్షోభాన్ని 1973, 1979 చమురు షాక్లు, అలాగే 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏర్పడిన ఇంధన సంక్షోభం కంటే తీవ్రమైనదిగా బిరోల్ అభివర్ణించారు. ఇంధన రంగంపై భౌగోళిక రాజకీయాల ప్రభావం ఇంతగా ఉండటం తానెప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. యూరప్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని రైట్వింగ్ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా బిరోల్ హెచ్చరించారు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడుతున్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందన్నారు.

​భారత్ పరిస్థితి ఏంటి?

ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ పలు ప్రభుత్వ శాఖలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. దిగుమతయ్యే పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించి.. దేశాన్ని ఇంధన స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లాలని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి, ఎథనాల్ మిశ్రణ, దేశీయ ఇంధన ఉత్పత్తి పెంపు వంటి ప్రత్యామ్నాయాలపై పరిశీలిస్తోంది. అవసరం లేని ఇంధన వినియోగాన్ని తగ్గించే మార్గాలను కూడా గుర్తించాలని ప్రధాని ఆదేశించారు. పశ్చిమాసియా ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం, వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరాలు, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడవచ్చని మోడీ హెచ్చరించారు. కోవిడ్ కాలంలో జరిగిన ఆర్థిక మార్పుల మాదిరిగా… దీర్ఘకాల ప్రభావాలకు ప్రభుత్వం, దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే.

​ఇరాక్ వంటి దేశాలకు ఇబ్బందులు
ఇక చమురు ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడే ఇరాక్ వంటి దేశాలు ఆర్థిక నష్టాల కారణంగా తిరిగి ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సహా మధ్యప్రాచ్య దేశాల్లో పూర్తి స్థాయి ఉత్పత్తి పునరుద్ధరణకు కనీసం ఏడాది పట్టవచ్చని అంచనా వేశారు.

మోడీ సర్కారుపై విమర్శలు
ప్రస్తుత ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ఆధారిత విధానంపై ఎన్నో సంవత్సరాలుగా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ.. భారత్ ఇంకా దిగుమతయ్యే ముడి చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతూ ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసివేతతో ఆ బలహీనత స్పష్టంగా బయటపడిందని చెప్తున్నారు. మోడీ సర్కారు 'ఆత్మనిర్భర్ ఎనర్జీ', 'గ్రీన్ హైడ్రోజన్', 'ఎలక్ట్రిక్ మొబిలిటీ' వంటి నినాదాలు ఇచ్చినా… క్ష‍ేత్రస్థాయిలో పెట్రోల్-డీజిల్ వినియోగాన్ని తగ్గించేంత పెద్ద మార్పు ఇంకా కనిపించలేదని విమర్శకులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana