Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు పనుల పేరుతో గుట్టల తవ్వకాలు

రోడ్డు పనుల పేరుతో గుట్టల తవ్వకాలు

సీఆర్ఆర్ 2024-25 నిధుల కింద రూ.1 కోటి 56 లక్షల అంచనా వ్యయంతో కిష్టంపేట్-చలిగల్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులకు 2025 సెప్టెంబర్ 27న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం గుట్టలను తవ్వడంతో వార్తల్లో నిలిచింది.

క్షేత్రస్థాయిలో జేసీబీలతో గుట్టలను తవ్వుతూ.. డంపర్ల ద్వారా మొర్రం తరలిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు సంబంధించిన అనుమతులపై స్పష్టత కోసం నవతెలంగాణ ప్రతినిధి రాయికల్ తహసీల్దార్ నాగార్జునను సంప్రదించారు. మొదట తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. అనంతరం 1000 మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు మాత్రమే ఐదు నుంచి ఆరు రోజులపాటు అనుమతి ఇచ్చామని తెలిపారు.

అయితే 1000 మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు జారీ చేసిన అనుమతి ప్రొసీడింగ్స్ నంబర్, అనుమతి కాలపరిమితి ఎంత..? ఈ అనుమతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారాల మేరకా లేక గనులు, భూగర్భ శాఖ నిబంధనల ప్రకారమా.? తవ్వకాలకు సంబంధించిన ట్రాన్సిట్ పాస్లు జారీ అయ్యాయా? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. పూర్తి వివరాలను తర్వాత అందజేస్తామని మాత్రమే పేర్కొన్నారు.

అనుమతులు ఉన్నాయంటే వివరాలు ఎందుకు లేవు?
ప్రభుత్వ పనుల కోసం మొర్రం వినియోగించడం కొత్త విషయం కాదు. కానీ సహజ వనరుల వినియోగానికి సంబంధించి ప్రతి ప్రక్రియకు చట్టబద్ధమైన రికార్డులు, అనుమతులు, పరిమితులు, రవాణా అనుమతులు ఉండాలి. ముఖ్యంగా ప్రజా వనరుల వినియోగంలో పారదర్శకత అత్యంత కీలకం. అధికారులు, కాంట్రాక్టర్ ఇద్దరూ అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన పత్రాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు కారణమవుతోంది.

1000 మెట్రిక్ టన్నులేనా..? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి?
తహసీల్దార్ తెలిపిన ప్రకారం 1000 మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల పరిమాణం నిజంగా ఆ పరిమితిలోనే ఉందా? ఇప్పటివరకు ఎంత మొర్రం తరలించారు? అనుమతి కాలపరిమితి పూర్తయ్యిందా? ఇంకా కొనసాగుతోందా? వంటి అంశాలపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. దీంతో స్థానికుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?
ప్రజా ధనంతో చేపట్టే ప్రతి పనిపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ముఖ్యంగా ప్రకృతి వనరుల వినియోగం జరిగే సందర్భాల్లో ప్రతి అనుమతి, ప్రతి ట్రాన్సిట్ పాస్, ప్రతి రాయల్టీ చెల్లింపు ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం'అనుమతులు ఉన్నాయి' అనే సాధారణ సమాధానం తప్ప, వాటి పూర్తి వివరాలు బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పారదర్శకతే అనుమానాలకు ముగింపు
ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటపడాలంటే సంబంధిత శాఖలు తవ్వకాల అనుమతి పత్రాలు, పరిమితి, ట్రాన్సిట్ పాస్లు, రాయల్టీ చెల్లింపుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ధనంతో నిర్మిస్తున్న రూ.1.56 లక్షల రహదారి పనుల విషయంలో పారదర్శకత పాటిస్తేనే ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగే అవకాశం ఉంటుంది. అనుమతులు ఉన్నాయనే మాట కంటే…ఆ అనుమతుల వివరాలే ప్రజలకు నమ్మకం కలిగిస్తాయి. ప్రస్తుతం అదే సమాచారం కోసం రాయికల్ మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana