Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్ఫూర్తి.. ప్యూర్ ఫుడ్ మూవ్మెంట్

స్ఫూర్తి.. ప్యూర్ ఫుడ్ మూవ్మెంట్

మాజంలో ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్య ఉద్యమమైనా, సామాజిక సంస్కరణలైనా మొదట అది ఒక మనసులో పుట్టిన బాధ్యత. తర్వాత అది ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు ఒక తరాన్ని ప్రభావితం చేసే ఉద్యమంగా మారుతుంది.

అలాంటి ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి స్పూర్తి రెడ్డి. శరీర వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కూడా అంతే లోతుగా అధ్యయనం చేసి జీవనశైలిలో తీసుకోవల్సిన మార్పుల గురించి పిల్లలకు, కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

హైదరాబాద్లో పుట్టి పెరిగిన స్పూర్తి రెడ్డి తల్లిదండ్రులు కొండ వివేక, అమ్రాది గాల్ రెడ్డి. కుటుంబంలో అన్నయ్య అరవింద్ రెడ్డితో కలిసి పెరిగిన ఆమె చిన్నప్పటి నుంచే పాఠశాలలో జరిగే వ్యాసరచన పోటీలు, వేదిక ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొనేవారు. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. అలాగే రవీంద్రభారతి వంటి వేదికలపై కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఆమెకు ఉంది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. యంత్రాల వ్యవస్థలను అర్థం చేసుకునే ఆసక్తితో ప్రారంభమైన ఆమె విద్యా ప్రయాణం తర్వాత మనిషి శరీరం, జీవనశైలి, ఆరోగ్య అవగాహన వైపు మళ్లింది. 'యంత్రాలను అర్థం చేసుకోవడానికి ఎంత లోతుగా నేర్చుకుంటామో మనిషి శరీర వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కూడా అంతే లోతుగా అధ్యయనం చేయాలి కదా?' అనే ఆలోచన ఆమె జీవిత దిశనే మార్చింది. ఆరోగ్యం, జీవనశైలి అవగాహనపై మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో శివంగి దేశాయ్ ఆధ్వర్యంలో హెల్త్ సర్టిఫికేషన్ కూడా పూర్తి చేశారు. అలాగే తన తల్లి నిర్వహించిన సామాజిక కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచే పాల్గొనడం వల్ల సమాజం పట్ల బాధ్యత కూడా సహజంగానే పెరిగిందని ఆమె చెబుతున్నారు.

తల్లిగా ప్రారంభమైన ఆలోచన
స్పూర్తి రెడ్డి కుటుంబంలో గర్భధారణ సమయంలో పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తన అమ్మమ్మ ప్రభావంతో తన తల్లి కూడా ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. 'నాకు చూపు లేకపోయినా.. నా పిల్లలకు ఆరోగ్యమైన కళ్ళు, ఆరోగ్యమైన శరీరం ఉండాలి' అని తరచూ చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే స్పూర్తి రెడ్డి గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్ఫూర్తి భర్త ప్రసుల రంగారెడ్డి. వీరికి ఇద్దరు కొడుకులు. పసుల ఆర్నవ్ రెడ్డి, పసుల ఈప్సిత్ రెడ్డి. ఒక తల్లిగా పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రారంభం నుంచే సహజ జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. చాలా అరుదైన సందర్భాల్లో తప్ప పిల్లలకు యాంటీబయాటిక్స్ వినియోగించలేదు. తన పిల్లల ఎదుగుదలను గమనిస్తూ నేటి పిల్లల్లో అధిక బరువు, ఒత్తిడి, మొబైల్ వ్యసనం, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆమె గమనించారు. ముఖ్యంగా అబ్బాయిల సమస్యలు చాలాసార్లు మౌనంగా మిగిలిపోతున్నాయని ఆమె భావించారు.

ఆరోగ్య అవగాహన వైపు ప్రయాణం
జీవనశైలి మార్పులు, ఆహార నియంత్రణ, శరీరంపై అవగాహన ద్వారా ఆమె తన ఆరోగ్య సమస్యలను అధిగమించారు. అదే అవగాహనతో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపైనా శ్రద్ధ పెట్టారు. ఆమె భర్తకు వచ్చిన మూత్రపిండ రాళ్ల సమస్యలో కూడా జీవనశైలి మార్పులతో పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలు ఆమెకు ఒక బలమైన నమ్మకాన్ని ఇచ్చాయి 'శరీరాన్ని అర్థం చేసుకుంటే, జీవన విధానాన్ని మార్చుకుంటే అనేక సమస్యలను ముందుగానే నియంత్రించుకోవచ్చు' అంటారు ఆమె. అందుకే ఆరోగ్యం, ఆహారం, గ్లైసెమిక్ సూచిక వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు, అధ్యయనాలు ప్రారంభించారు. స్ఫూర్తి ప్రయాణంలో 'డిజిటిల్ మహిళా' వేదిక, Dr. Aslesha Edala మార్గదర్శకత్వం ఆమెకు మరింత స్పష్టతను ఇచ్చాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆరోగ్య అవగాహనను వ్యవస్థీకృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో హెల్త్ కోచ్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

బాలుర ఆరోగ్యం కోసం
పెరుగుతున్న వయసులో బాలురకు కేవలం చదువు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన శరీరం, భావోద్వేగ సమతుల్యత, ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, సరైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా అవసరం. ప్రస్తుతం అనేక కుటుంబాల్లో బాలుర ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయని ఆమె అంటున్నారు. ఈ సమస్యలకు చిన్నప్పటి నుంచే సరైన జీవనశైలితో అధిగమించవచ్చని చెబుతున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 'GrowFit Boys' ద్వారా వారికి హెల్త్ కోచ్ అందిస్తూ సరైన ఆహారపు అలవాట్లు, శారీరక చలనం, జీవనశైలి అవగాహన, ఆరోగ్యకరమైన ఎదుగుదలపై ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

ఎర్లీ రైజర్స్ ఫ్యామిలీ క్లబ్
కుటుండానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్పూర్తి రెడ్డి, Behavioral Coach మమతతో కలిసి 'ఎర్లీ రైజర్స్ ఫ్యామిలీ క్లబ్'ను ప్రారంభించారు. ఇది కుటుంబ స్థాయిలో జీవనశైలి మార్పులు తీసుకురావడానికి రూపొందించిన ఒక కుటుంబ ఆరోగ్య, ప్రవర్తనా వికాస వేదిక. ఈ క్లబ్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. 'ఎర్లీ రైజర్స్ ఫ్యామిలీ క్లబ్' కార్యక్రమంలో పాల్గొంటున్న కుటుంబాలు తమ పిల్లల్లో వచ్చిన మార్పులను ఆనందంగా పంచుకుంటున్నాయి. అలారం లేకుండానే ఉదయం లేవడం, మొబైల్ వినియోగం తగ్గించడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లను పిల్లలు స్వయంగా అలవరుచుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత, బాధ్యత భావం కూడా పెరిగిందని చెబుతున్నారు. అలాగే క్రమమైన స్ట్రెచింగ్లు, జీవనశైలి మార్పుల తర్వాత కొంతమంది పిల్లల్లో శరీర భంగిమ మెరుగుపడటం, కొద్దిగా ఎత్తు పెరిగినట్లు కనిపించడం, ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు తగ్గడం వంటి మార్పులను కూడా గమనిస్తున్నారు.

HealthiNjunk
నేటి కాలంలో మార్కెట్లో 'హెల్తీ' పేర్లతో అనేక ఆహార పదార్థాలు వస్తున్నాయి. అయితే అవి శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదు. దేశంలో మధుమేహుల సంఖ్య పెరుగుతున్న సమయంలో పిల్లలు తినే ఆహారం గురించి మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు. అందుకే తక్కువ నుంచి మోస్తరు గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహార పదార్థాల రూపకల్పనపై ఆమె ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ బ్రాండ్లు తమ ఉత్పత్తులపై గ్లైసెమిక్ సూచిక వివరాలు ఇవ్వకపోవడం పట్ల కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తన 'HealthiNjunk' ఉత్పత్తులపై గ్లైసెమిక్ సూచిక వివరాలను పారదర్శకంగా అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.

పాఠశాలల నుంచే ఆరోగ్య విప్లవం
పిల్లలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం పాఠశాల. అక్కడే ఆరోగ్యం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణ, ఆహారపు అలవాట్లు, ప్రవర్తనా వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆమె భావించారు. అందుకే పాఠశాలల్లో వారానికి ఒకసారి అయినా జీవనశైలి అవగాహన కార్యక్రమాలు ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. 'సమాజంలో చెడు అలవాట్లు ఒక అలలా వ్యాపించినట్లే.. మంచి ఆరోగ్య అలవాట్లు కూడా ఒక ఉద్యమంలా వ్యాపించాలి' అంటారు స్ఫూర్తి. అందుకే ఆమె దృష్టిలో ఇది కేవలం ఆరోగ్య కార్యక్రమం కాదు. 'ప్యూర్ ఫుడ్ మూవ్మెంట్'. కుటుంబాల్లో మళ్లీ నిజమైన ఆహారం, నిజమైన ఆరోగ్యం, నిజమైన జీవనశైలి తీసుకురావాలనే ప్రయత్నం. 'ఆరోగ్యమైన కుటుంబాలే ఆరోగ్యమైన దేశాన్ని నిర్మిస్తాయి' అనే నమ్మకంతో స్పూర్తి రెడ్డి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana