Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం

స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం

స్నేహం.. ఓ మధురం, ఓ ధైర్యం, ఓ త్యాగం, ఓ సంబరం. షరతులేమీ లేనిదే స్నేహం. కష్టసుఖాల్లో తోడుండేదే స్నేహం. హోదా, కులమతాలు లేనిది. వయసు, లింగబేధాలు లేనిదే స్నేహం.

మంచిని బోధించి దారి చూపేది. మందలించి బాగోగుల్ని చూసేది. కలత చెందిన మనసుకి ఔషధం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరుండేది. బాల్యం నుంచి జీవితకాలం తోడుండేది. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో…

స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే నిర్ధిష్టమైన నియమ నిబంధనలు, ప్రణాళికలు, అంచనాలు ఏమీ ఉండవు. స్నేహానికి వయసుతో, కులమతాలతో, స్థితిగతులతో, లింగభేదంతో, ఎల్లలతో సంబంధం ఉండదు. ఎవరి మధ్యనైనా స్నేహం చిగురించవచ్చు. అలా చిగురించిన స్నేహాన్ని ఎలాంటి వ్యత్యాసాలను, తారతమ్యాలను చూపించి మాన్పించలేము. ఒకసారి ఏర్పడ్డ స్నేహం చిన్నచిన్న కష్టాలు, కలతలు, అపార్థాలు వచ్చినా కూడా తిరిగి మరింత పటిష్ఠమై జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పెద్దలు కులమతాల తారతమ్యాలు, స్థితిగతుల వ్యత్యాసాలను చూపి స్నేహాన్ని వదులుకోమన్నా కూడా వదలకుండా కొనసాగించిన అనుభవాలు, జ్ఞాపకాలు మన మధ్యనే ఎన్నో ఉన్నాయి.

అన్ని బంధాలను తలపిస్తుంది
స్నేహబంధం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క బంధంలా తన రూపాన్ని మార్చుకుని ప్రవర్తించగల శక్తివంతమైనది. ఒకసారి గురువులా మారి మంచిని బోధించి మంచి మార్గాన్ని చూపిస్తుంది. మరోసారి తల్లిదండ్రుల్లా మారి మంచి చెడులను విశ్లేషించి వివరంగా చెబుతుంది. మందలించి మన బాగోగులను చూస్తుంది. కష్ట సమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతతను కలిగించి ధైర్యాన్ని ఇస్తుంది. మన సంతోషంలో నవ్వుగా మారుతుంది. బాధ కలిగితే మన దుఃఖంలో సగపాలు పంచుకుంటుంది. చివరికి ఎంత త్యాగానికైనా సిద్ధపడే మరువలేని అనుబంధంగా మారుతుంది ఈ స్నేహం.

కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా
బాల్యంలో తెలిసీ తెలియని వయసులో ప్రారంభమైన స్నేహం కాటికి వెళ్లే వరకు మనతోనే నడుస్తుంది. ఇన్నేండ్ల జీవిత ప్రయాణంలో మన కంటికి దగ్గరగా లేకపోయినా, మన మనసుకు దగ్గరగా ఉంటుంది. మనకు అండగా ఉంటూ ధైర్యం చెబుతుంది. బాధకైనా, సంతోషానికైనా విషయం తెలిసిన వెంటనే, ఎంత దూరాన ఉన్నా సమయం చూడకుండా మన ముందుండే ఆత్మీయ బంధమే ఈ స్నేహం. బాల్యంలో పరిచయమైన స్నేహితులందరూ వృద్ధాప్య ఛాయలు వచ్చినా, ఎన్ని పనులున్నా ఆపుకుని 'పూర్వ విద్యార్థుల స్నేహితుల కలయికలు' ఏర్పాటు చేసుకునే ఉన్నతమైన సంప్రదాయాన్ని సమాజంలో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అదే స్నేహానికి ఉన్న విడదీయలేని అనుబంధం. అలాంటి కలయికలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.

స్నేహితుల దినోత్సవ ఉద్దేశం
ఈ విశ్వంలో అనేక వైవిధ్యాలు కలిగిన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాలు ఉన్నాయి. జీవనశైలిలో, కట్టుబొట్టులో, భాషల్లో, యాసల్లో, సంస్కృతిలో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భిన్నత్వాలు కనిపిస్తాయి. అలాంటి భిన్నత్వాల్లో ఏకత్వాన్ని తీసుకురాగల గొప్ప బంధమే ఈ స్నేహం. ప్రపంచ దేశాల ప్రజలకు స్నేహబంధానికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసి వారిలో 'మనమందరం స్నేహితులమే' అనే భావనను పెంపొందించి ప్రపంచ శాంతిని నెలకొల్పడమే ప్రపంచ స్నేహితుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana