Thursday, 22 Apr, 10.21 pm నవ తెలంగాణ

సంపాదకీయం
సోషలిస్టు పథంలో క్యూబా

క్యూబా విప్లవానికి గుండెకాయ లాంటి క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ (పీసీసీి)ఎనిమిదో మహాసభ ఇటీవల హవానాలో విజయవంతంగా ముగిసింది. ప్రతి అయిదేండ్లకొకసారి జరిగే ఈ మహాసభ రానున్న అయిదేండ్ల కాలానికి పార్టీకి, దేశానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో కీలక భూమిక వహిస్తుంది. ఆ రీత్యా పీసీసీ ఎనిమిదో మహాసభ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోబాటు ఈ మహాసభ కొన్ని ప్రత్యేకతలను కూడా కలిగివుంది. 1959లో బటిస్టా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సారథ్యం వహించిన విప్లవనేత, ఇరవయ్యో శతాబ్దంలో చరిత్రను మలుపు తిప్పిన విప్లవ యోధుడు ఫైడెల్‌ కాస్ట్రో లేకుండా జరిగిన తొలి మహాసభ ఇది. 1953లో మోంకాడ్‌ బ్యారక్‌పై సోదరుడు ఫైడెల్‌ కాస్ట్రోతో కలసి సాయుధ తిరుగుబాటు చేయడం ద్వారా తొలిసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రావుల్‌ కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి విరమించుకోవడం, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ బదలాయింపు చారిత్రిక తరం నుంచి కొత్త తరానికి సాఫీగా సాగిపోవడం ఈ మహాసభ మరో ప్రత్యేకత. రావుల్‌ కాస్ట్రో నిష్క్రమణతో క్యూబా చరిత్రలో ఒక శకం ముగిసింది. అమెరికా ప్రాపకంతో బటిస్టా సాగించిన దుర్మార్గమైన పాలనకు తెరదించి 1959లో అధికారం చేపట్టిన ఫైడెల్‌ కాస్ట్రో 2008లో అనారోగ్యానికి గురయ్యేంత వరకు అధ్యక్షుడిగా, క్యూబా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత రావుల్‌ కాస్ట్రో ఆ బాధ్యతలు చేపట్టారు. పదేండ్ల పాటు క్యూబా అధ్యక్షునిగా కొనసాగిన ఆయన వయోభారం రీత్యా 2018లో దాని నుంచి విరమించుకుని, కొత్తతరం నేత మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కానెల్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రికల్‌ ఇంజనీరు. అయినా, విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధ్యక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. చారిత్రిక తరం అందించిన స్ఫూర్తివంతమైన నాయకత్వంలో క్యూబా విద్య, ఆరోగ్య రంగాల్లో అద్భుతాలు సాధించింది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో క్యూబాతో పోల్చితే అమెరికా వెనుకబడి ఉందనే చెప్పాలి. అమెరికా ఇతర దేశాలకు బాంబులను ఎగుమతి చేస్తే, క్యూబా తన వైద్య బృందాలను పంపి విపత్తుల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసింది. క్యూబాలో సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసేందుకు అమెరికా ఆర్థిక దిగ్బంధనంతో సహా అనేక కుట్రలకు పాల్పడింది. 1961లో క్యూబా విప్లవాన్ని దెబ్బతీసేందుకు 'బే ఆఫ్‌ పిగ్స్‌' ఆపరేషన్‌ను నిర్వహించగా కాస్ట్రో ప్రభుత్వం దానిని చిత్తుచేసింది. ఆ సంవత్సరమే క్యూబాలో సోషలిస్టు చార్టర్‌ అమలు చేస్తున్నట్టు కాస్ట్రో ప్రకటించారు. ఈ రెండు చారిత్రిక ఘట్టాల 60వ వార్షికోత్సవాలు క్యూబా నేడు జరుపుకుంటున్నది. క్యూబా విప్లవాన్ని, సోషలిజాన్ని పరిరక్షించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృతనిశ్చయంతో ఉందని నూతన నేత మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ మహాసభలో చేసిన ఉద్ఘాటన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి క్యూబాపైనా పంజా విసిరింది. అమెరికా ఆర్థిక దిగ్బంధనం, లాటిన్‌ అమెరికాలో మితవాద శక్తులు తిరిగి తలెత్తడం వంటి పరిణామాలు క్యూబాను ఆర్థికంగా, రాజకీయంగా మరిన్ని ఇబ్బందులకు గురిచేశాయి. ఉన్న పరిమిత వనరులతోనే ప్రగతిసాధించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించడం నూతన నాయకత్వ సామర్థ్యానికి ఒక పెద్ద పరీక్ష. కరోనా వల్ల ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం ఇప్పటికే చాలావరకు దెబ్బతినిపోయింది. పార్టీ నాయకత్వంలో అత్యధిక శాతం మంది క్యూబా విప్లవం తరువాత పుట్టినవారే. ఈ రీత్యా పార్టీ క్యాడర్‌ను సైద్ధాంతికంగా, రాజకీయంగా పటిష్టపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. క్యూబాను అస్థిరపరిచేందుకు విచ్ఛిన్నకర శక్తులను నిరంతరం ఎగదోస్తున్న అమెరికా కుతంత్రాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని మహాసభ హెచ్చరించింది. 2019లో రాజ్యాంగంలో తెచ్చిన మార్పులను అమలు చేయడంలోను, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొత్తతరం నాయకత్వానికి పరీక్షే. క్యూబా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణం పట్ల పార్టీ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, నిరంతర అభివృద్ధిపై వారిలో విశ్వాసం కల్పించేందుకు ప్రభుత్వం, పార్టీ నిబద్ధతతో కృషి చేయాలని, స్వయం ఉపాధి, ఉత్పాదక రంగాల్లో భాగస్వామ్యం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మహాసభ ఉద్ఘాటించింది. కోవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిరంతర శోధన ద్వారా క్యూబా ప్రజలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నూతన నాయకత్వ భుజస్కంధాలపై ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top