Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుది దశకు కాజీపేట రైల్ తయారీ యూనిట్

తుది దశకు కాజీపేట రైల్ తయారీ యూనిట్

రాబోయే ఐదేండ్లలో 
 ఇంటర్ సిటీ ట్రైన్స్ తయారీఅందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై
 కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కాజీపేట రైల్ తయారీ యూనిట్ పనులు తుది దశకు చేరినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ఇది బహుముఖ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ యూనిట్గా సేవలందించనున్నట్టు తెలిపారు. రాబోయే ఐదేండ్లలో ఈ యూనిట్ నుంచి 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేయనున్నట్టు చెప్పారు. కాజీపేట రైల్ యూనిట్ను కార్యచరణలోకి తెచ్చే ప్రణాళికలపై గురువారం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈ మీటింగ్ లోని ముఖ్య అంశాలను రైల్వే శాఖ మీడియాకు వెల్లడించింది. ఈ ఇంటర్ సిటీ రైళ్లలో ఉండే సాంకేతిక, నూతన సౌకర్యాలు, అతి తక్కువ కర్బన ఉద్గారాల ప్రత్యేకతలను తెలిపింది.

​మోడ్రన్ టెక్నాలజీ… గంటకు 130 కి.మీ వేగం…
కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్ సిటీ రైళ్లను అత్యాధునిక టెక్నాలజీతో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. గంటకు 130 కి.మీ వేగంతో ఈ రైళ్లు దూసుకుపోతాయన్నారు. అయితే దేశవ్యాప్తంగా సుమారు 300 కి.మీ ల వరకు ఈ ట్రైన్లు నడపనున్నట్టు చెప్పారు. ప్రధానంగా పలు పట్టణాలు, నగరాల మధ్య సులభతర ప్రయాణాన్ని అందించేందుకు వీలుగా ట్రిప్ లో అనేక స్టాప్ లు ఉంటాయన్నారు. సమీప పట్టణాల్లో చదువుకునే విద్యార్థులు, ఆరోగ్య, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.

​20 కోచ్లు..
కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమెటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్ తో రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి రైల్లో 20 కోచ్లు ఉంటాయన్నారు. వీటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఎలాంటి కుదుపులూ లేకుండా కప్లర్లు, బోగీలు ఉంటాయని తెలిపారు. ప్రతి కోచ్కూ రెండు వైపులా ఒక్కో టాయిలెట్ ఉంటుందని చెప్పారు. ఇక ఈ ట్రైన్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సిస్టంతో రైలు బ్రేక్ లు వేసినప్పుడు… అది విద్యుత్ జనరేటర్గా మారి, విద్యుత్ను పునరుత్పత్తి చేస్తోందన్నారు. ఈ ఉత్పత్తి అయిన పవర్ తిరిగి గ్రిడ్ లోకి వెళ్తోందని చెప్పారు. ఇది పర్యావరణహితమైన రవాణా విధానంతో పాటు, రోడ్డు రవాణాతో పోల్చితే అతి తక్కువ కర్బన్ ఉద్గారాలను కలిగి ఉంటుందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana