నవతెలంగాణ - అశ్వారావుపేటత్యాగం, క్రమశిక్షణ, నిస్వార్థం, ప్రజల పట్ల అంకితభావం అని తన జీవితం ద్వారా చూపించిన మార్క్సిస్టు మహానేత కామ్రేడ్ సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు.
సుందరయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించిన సంస్మరణ సభలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.
అనంతరం పార్టీ మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు వ్యక్తిగత జీవితం, రాజకీయ ఆచరణ, ప్రజా నిబద్ధత ఒకటే కావచ్చని నిరూపించారు అని, కుల గుర్తింపులు, ఆడంబరాలు, అధికార హోదాలను దూరంగా ఉంచి సామాన్య ప్రజల జీవితానికే తన రాజకీయాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచారు అన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని సమాజానికి బాధ్యతాయుత జీవన విధానాన్ని సూచించడం, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ విలాసాలకు దూరంగా సైకిల్పై తిరుగుతూ కార్యకర్తలకు ఆదర్శంగా నిలవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ప్రజా రాజకీయాలు అంటే పదవులు కాదు అని నిరూపించిన ఆధునిక ఆదర్శ కమ్యూనిస్టు సుందరయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్,మడిపల్లి వెంకటేశ్వరరావు, మురహరి రఘు,వాడపల్లి రమేష్,తాండ్ర రాంబాబు లు పాల్గొన్నారు.

