Dailyhunt
ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షల సమయం పెంపు

ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షల సమయం పెంపు

హైదరాబాద్ : ప్రస్తుతం ప్రతీ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెడుతూ సందర్శకులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

అయితే నగర ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకరంగా ఎక్కువ సమయం గడిపేందుకు ఇక నుంచి ప్రతీ ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షల సమయాన్ని పెంచుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిషేధిస్తూ, ఆ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు
ప్రతీ ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి సందర్శకులను అనుమతిస్తుండడంతో ట్యాంక్‌బండ్‌పైకి నగర ప్రజలు భారీగా వస్తున్నారు. దాంతో వారికి మరింత సమయం కల్పించేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ చర్చించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటం, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కొద్దిసేపు ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో గడిపేందుకు సమయం కలిసి వస్తుందని అధికారులు భావించినట్టు తెలిసింది. దాంతో వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు ప్రారంభించారు.
అలాగే అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వరకు, రాణిగంజ్‌ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్‌ పార్కు వరకు, ట్యాంక్‌బండ్‌కు ఇరువైపుల పార్కింగ్‌ చేసుకునే విధంగా ఇప్పటికే పార్కింగ్‌ స్థలాలను కేటాయించిన విషయం తెలిసిందే. సాధారణ వాహనదారులు ఆదివారం మూడు గంటల నుంచి ట్యాంక్‌బండ్‌కు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana