Dailyhunt
ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

నాలుగింటిలో బీజేపీ విజయంరెండు స్థానాల్లో కాంగ్రెస్.. ఒక సీటు ఎన్సీపీ వశం న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక సీటును నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) భారీ మెజారిటీతో సొంతం చేసుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాలతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

గతనెలలో ఈ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం… గుజరాత్లోని ఉమ్రెత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హర్షద్బారు గోవింద్బారు పర్మార్ విజయం సాధించారు. కర్నాటకలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలనూ అధికార కాంగ్రెస్ చేజిక్కించుకుంది.

బాగల్కోట్ నుంచి ఉమేశ్ హుల్లప్ప మేతి, దేవనగెరె సౌత్ నుంచి సమర్త్ షమనూర్ మల్లికార్జున విజయం సాధించారు. ఇక మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతితో అనివార్యమైన బారామతి ఉప ఎన్నికలో ఆయన భార్య సునేత్ర అజిత్ పవార్ (ఎన్సీపీ) విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక మూడు రాష్ట్రాల్లోని మూడు స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. మహారాష్ట్రలోని రహురి నుంచి అక్షరు శివాజీరావ్ కర్డిలే, నాగాలాండ్లోని కొరిడంగ్ నుంచి డౌచీర్ ఇమ్చేన్, త్రిపురలోని ధర్మనగర్ నుంచి జహర్ చక్రవర్తి విజయం సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana