Dailyhunt
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు వెంటనే ఉపసంహరించాలి

ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు వెంటనే ఉపసంహరించాలి

వతెలంగాణ - ఆలేరు రూరల్ ఆలేరు మండలంలో గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు.గురువారం మండలంలోని ఉపాధి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు.

ముఖ్యంగా ఫోటో క్యాప్చర్ విధానం కూలీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొన్నారు.ఐరిస్,ఫోటోలు సరిగా నమోదు కాకపోవడంతో చేసిన పనికి వేతనాలు అందకుండా పోతున్నాయని,సాంకేతిక సమస్యల వల్ల కూలీలు నష్టపోతున్నారని తెలిపారు.అదేవిధంగా ఉపాధి హామీ నిధులను కేంద్రం గణనీయంగా తగ్గించిందని విమర్శించారు.గతంలో 90 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం వాటాను 60 శాతానికి తగ్గించి,మిగిలిన 40 శాతం భారం రాష్ట్రంపై మోపిందని అన్నారు.ఇది గ్రామీణ పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్య అని అభిప్రాయపడ్డారు.పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని రోజుకు కనీస వేతనాన్ని రూ.600కు పెంచాలని,ప్రతి కూలికి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.

మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పనిముట్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవిలో ఇచ్చే సమ్మర్ అలవెన్స్ను పునరుద్ధరించాలని,వితంతువులు మరియు వృద్ధులకు తేలికపాటి పనులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పాత విధానాన్ని కొనసాగిస్తూ కొత్త జాబ్ కార్డులను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక మంది కూలీలు ఉపాధి హామీ పథకం నుంచి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అంజమ్మ, విజయలక్ష్మి, గీత, వత్సరూప, నన్నూరి మణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana