Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరదల విపత్తులపై అప్రమత్తతే ప్రాణ రక్షణ

వరదల విపత్తులపై అప్రమత్తతే ప్రాణ రక్షణ

- ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో 7 మండలాల్లో మాక్ ఎక్సర్సైజ్లునవతెలంగాణ - కామారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విపత్తు నిర్వహణ - 2026 కార్యక్రమం కింద వరదలపై మాక్ ఎక్సర్సైజ్ను సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌండిల్య కాలనీలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని వివిధ డెమోలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదల సమయంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలు, సహాయక చర్యలను మరింత మెరుగుపరచడమే మాక్ ఎక్సర్సైజ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి వేగంగా స్పందించాలని సూచించారు.

మాక్ డ్రిల్ ద్వారా విపత్తు నిర్వహణలో ఉన్న లోపాలను గుర్తించి స్పందన వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని కామారెడ్డి, బిక్నూర్, రాజంపేట, బీబీపేట్, మద్నూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు, శాఖల సమన్వయంపై అధికారులు ప్రత్యక్ష సాధన నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ (CPR) ద్వారా ప్రాథమిక చికిత్స అందించే విధానం, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించే పద్ధతులపై డెమో నిర్వహించారు. సహాయక బృందాలు రెస్క్యూ పరికరాల వినియోగం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలను ప్రదర్శించాయి. అనంతరం మాక్ డ్రిల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్కోట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో లేబర్ శాఖ అధికారి శశికుమార్, పోలీస్ బెటాలియన్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ ( ఇన్చార్జ్ ) ఎన్వీ గిరి, డి ఎఫ్ ఓ సుధాకర్, డీసీఎంహెచ్వో విజయభాస్కర్, పీడీ మెప్మా శ్రీధర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, యువత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని విపత్తు నిర్వహణ అధికారులు జూమ్ మీటింగ్ ద్వారా పర్యవేక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana