Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేగవంతమైన విద్యుత్ ప్రయివేటీకరణ

వేగవంతమైన విద్యుత్ ప్రయివేటీకరణ

- డిస్కంల ఆస్తుల లెక్కలివ్వండి
- మ్యాపింగ్‌ కూడా...
- ప్రతి యూనిట్‌కూ పక్కా లెక్కుండాలి
- మూడ్నెల్లకోసారి ఎనర్జీ ఆడిట్‌
- ఓల్టేజీలవారీగా ఇంధన లెక్కలు తేల్చాలి
- ఎనర్జీ ఆడిట్‌ రూల్స్‌ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశ ప్రజలంతా కోవిడ్‌-19 విస్తృతి భయాందోళనల్లో ఉంటే, దీన్నే అనుకూలంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం తన ప్రయివేటీకరణ విధానాల అమలు వేగాన్ని పెంచింది. తాజాగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బిఈఈ) ద్వారా ఎనర్జీ ఆడిట్‌ రూల్స్‌ ముసాయిదా (నోటిఫికేషన్‌)ను విడుదల చేసింది.

దీనిలో డిస్కంల వద్ద ఉన్న సమస్త సమాచారాన్ని తమకు పంపాలని ఆదేశించింది. ప్రతి నెట్‌వర్క్‌ పాయింటు, వినియోగదారుడికి తప్పనిసరిగా మీటర్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. మూడునెలలకోసారి ఫీడర్‌, సర్కిల్‌, డివిజన్‌ వారీగా విద్యుత్‌ ఆడిటింగ్‌ నివేదికలను కేంద్రానికి పంపాలని ఆ నోటిఫికేషన్‌లో ఆదేశించింది. 33కేవీ లైన్ల నుంచి 11 కేవీ లైన్లకు ఎంత విద్యుత్‌ సరఫరా అవుతున్నదీ, 11 కేవీ నుంచి ఫీడర్లకు ఎంత పోతుందో కూడా పక్కా లెక్కలు తీసి పంపమని చెప్పింది.

ఊహాజనితమైన అంచనాలను ఆమోదించేది లేదనీ, ప్రతి యూనిట్‌కూ పక్కా లెక్క చెప్పాల్సిందేననీ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా ఎనర్జీ ఆడిటింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలనీ, చీఫ్‌ ఇంజినీర్‌ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన నోడల్‌ అధికారిని నియమించి, ఆ వివరాలన్నీ తమకు పంపాలని కోరింది. నోడల్‌ అధికారి పూర్తి సమయం విధుల్లో ఉండాలని ఆదేశించింది. ఎలక్ట్రికిల్‌ నెట్‌వర్క్‌ ఆస్తుల గుర్తింపు, వాటి మ్యాపింగ్‌ను కూడా అందచేయాలి.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎనర్జీ ఆడిటింగ్‌, ఆడిట్‌ అనుబంధ సాఫ్ట్‌వేర్‌ వివరాలు, భద్రత, ప్రోటోకాల్‌ సహా సకల సమాచారం వెల్లడించాలి. నివేదికల రూపకల్పనలో ఎలాంటి మాన్యువల్‌ జోక్యం ఉండరాదని పేర్కొన్నారు. డిస్కంల ఆస్థులు, వాటి నిర్వహణ తదితర అంశాలను కూడా తెలపాలి. అధిక నష్టాలను కలిగించే ప్రాంతాలు, నెట్‌వర్క్‌ల వివరాలను కూడా ఎనర్జీ ఆడిటింగ్‌లో గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి త్రైమాసిక వివరాలను ఆ తర్వాతి 15 రోజుల్లోపు బిఈఈ కి అందచేయాలి. విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్‌ ప్రకారం నివేదికలన్నీ జాతీయ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయబడతాయని వివరించారు. డిస్కంల బలాలు, బలహీనతలను గుర్తింపు పొందిన ఎనర్జీ ఆడిటర్‌ ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana