Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెంటాడిన ప్రశ్నలు

వెంటాడిన ప్రశ్నలు

నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా వెళ్లాడు. యాభై ఆరించుల ఛాతీతో వెళ్లాడు. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడి మరీ వెళ్లాడు. కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించాడు.

అంతర్జాతీయంగా ఇప్పటికే, విదేశాంగ విధానం తలకిం దులవుతున్న దశలో, ఇప్పుడు మరింత దిగజారిపోయింది. నార్వే దేశానికి చెందిన 'డాగ్సా విసెస్' పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు హెల్లీ లింగ్ ఒక ప్రశ్నను సంధించారు. పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న నార్వేలో ఒక జర్నలిస్టు వేసే ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. భారతదేశంలో మానవ హక్కులు, మైనారిటీ హక్కులు, పత్రికా స్వేచ్ఛలపై ఆమె ప్రశ్నలు వేస్తున్నప్పుడు అతివేగంగా మన బాహుబలుడు వెళ్లిపోవడం చూస్తే ప్రశ్నలు ఎంత బలమైనసత్యంతో కూడుకున్నవో అవగతమౌతుంది. అసలు మన నాయకుడికి గత పన్నెండేళ్ల నుండి దేశంలో పత్రికా సమావేశాన్ని పెట్టలేదనే విషయం పాపం వాళ్లకేమి తెలుసు! ప్రశ్నలు ఎదుర్కోవడానికి నిజాయితీ ఉండాలి. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండాలి.

సరే.. ప్రధానిగారు తీవ్ర పనులతో ప్రశ్నలను తీసుకునే అవకాశం కుదరలేదని అనుకుందాం. అలా, ఆ తర్వాత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అతనికి జర్నలిస్టు ప్రశ్నలు వేసింది. భారతదేశంలో ప్రాథమిక హక్కులు నిరాకరించబడుతున్నవేళ, నార్వే మీ దేశాన్ని ఎట్లా విశ్వసిస్తుంది? అన్నది ఆమె ప్రశ్న అయితే, సిబి జార్జ్ కూడా మన వాట్సప్ యూనివర్సిటీ వండి వడ్డించే సమాధానాలే చెప్పాడు. మాకు కొన్ని వేల సంవత్స రాల ప్రాచీన చరిత్ర ఉంది. మా రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు గ్యారంటీ చేసిందన్నాడు. మరెందుకు హక్కులు నిరాకరించ బడుతున్నాయంటే? హక్కులు నిరాకరిస్తే, ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించగలరు అని సెలవిచ్చారు. అసలు ప్రజలు గ్యారంటీ చేయబడిన హక్కుల కోసం కోర్టులకు పోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ఆ జర్నలిస్టు తిరిగి ప్రశ్నిస్తే, ఇది నేను పెట్టిన పత్రికా సమావేశం. నేనే నిర్ణయిస్తాను. అంటూ ప్రశ్నలను దాటవేసి, కొనసా గించారు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయమేమంటే కింది నుంచి పై వరకు మన వాళ్లంతా ప్రశ్నల నుండి తప్పుకునేవాళ్లేనని తెలుస్తున్నది.

అందుకే మనదేశం పత్రికా స్వేచ్ఛలో 157వ స్థానంలో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే దిగువన ఉంది. ప్రథమ స్థానంలో ఉన్న నార్వే పత్రికల ప్రశ్నలకు జవాబు లెట్లా ఇవ్వగలరు! ఆ ప్రశ్నలు వేసిన వ్యక్తి లింగ్ పొరపాటున ఇండియాలో ఉండి ఉంటే అరెస్ట్ చేయటమో! ఈడి, సి.బి.ఐ రైడ్ చేయడమో, ఆమె ఇంటిని బుల్డోజ్ చేయడమో చేసేవారు. నార్వే కాబట్టి బతికిపోయింది. ఇక మన దేశంలోని మోడీ భక్త ఛానెళ్లు, అమ్ముడుపోయిన ఛానెళ్లు ఈ సంఘటనతో తెగ బాధపడి పోతున్నాయి. అంతేకాదు, ఆ జర్నలిస్టుపై లేనిపోని ఆరోపణలకూ, చైనా ఏజెంట్ అని నిందలు వేయటం మొదలేశారు. ట్రోలింగ్కూ పాల్పడుతున్నారు. కానీ, నేను జర్నలిస్టుని, ప్రశ్నలడగటమే నా పని, సమాధానాలు రాబట్టటం కోసం ఎన్ని ప్రశ్నలయినా అడుగుతాను.

వాళ్లు విసుక్కున్నా సరే! అని ఆమె చెప్పటం మన వాళ్లకు పాఠం ఎప్పుడు అవుతుందో! ఉమర్ ఖాలిద్ అనే విద్యార్థి, ఉద్యమ కారుడిని ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా ఐదు సంవత్సరాలుగా నిర్బంధించి, ఉపా చట్టాన్ని మోపారు. ప్రభుత్వానికి గానీ, నాయకులకు గానీ వ్యతిరేక అభిప్రాయా లను వెల్లడిస్తే అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి, నిర్బంధానికి పూనుకుంటున్నారు. సాయిబాబా, వరవరరావు, స్టాన్ స్వామి ఇంకా వందలాది మంది ప్రాథమిక హక్కులు నిరాకరించబడు తూనే ఉన్నాయి. ఇక నేను హిందువుల కోసమే పనిచేస్తానని ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి ప్రకటిం చడం, ముస్లింలు పారిపోయేట్లు చేస్తామని అనడం ఎంత దారుణం. దీన్ని ప్రజాస్వామ్యం అని ఎలా అనగలం? కాబట్టి నార్వే జర్నలిస్టు వేసిన ప్రశ్న చాలా చాలా అవసరమైన ప్రశ్న.

మన ప్రధానిగారు నార్వే పర్యటనకు ఎందుకు వెళ్లారు? మనదేశం 43 ఏండ్ల తర్వాత మళ్లీ మన మోడీ గారే వెళ్లారు. దీని అసలు లక్ష్యాలు వేరుగా ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. 'నార్వేస్ సావరెన్ వెల్ఫేర్ ఫండ్' అనేది పెద్ద మొత్తంలో వాటాలు కలిగిన ఒక నిధి. ఇందులో అనేక సంస్థలలో వాటాలు కలిగి ఉంటుంది.ఆ సంస్థ, మన అదానీ గారి కంపెనీని బ్లాక్ లిస్ట్లో ఫిబ్రవరిలోనే పెట్టింది. ఇక దానికి అవకాశం లేదు. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దటం కోసం అదాని తరపున ప్రధాని మోడీ వెళ్లాడని కథనాంశం. అంతకంటే పెద్ద ప్రయోజకత్వం మన పెద్దాయనకు ఏముంటది! ఏది ఏమైనా ప్రశ్నలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. రేపు మన దేశంలోనూ ప్రశ్నలు మొలకెత్తుతాయి!పెద్ద మొత్తంలో వాటాలు కలిగిన ఒక నిధి. ఇందులో అనేక సంస్థలలో వాటాలు కలిగి ఉంటుంది. మన అదానీ గారి కంపెనీని బ్లాక్ లిస్ట్లో ఆ సంస్థ ఫిబ్రవరిలో పెట్టింది. ఇక దానికి అవకాశం లేదు. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దటం కోసం అదాని తరపున ప్రధాని మోడీ వెళ్లాడని కథనాంశం. అంతకంటే పెద్ద ప్రయోజకత్వం మన పెద్దాయనకు ఏముంటది! ఏది ఏమైనా ప్రశ్నలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana