Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేసవిలో పాలు పాడవకుండా..

వేసవిలో పాలు పాడవకుండా..

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎదురయ్యే ప్రధాన సమస్య పాలు విరిగిపోవడం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాలలోని బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, పాలు త్వరగా పాడైపోతాయి.

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి , పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను సూచిస్తున్నారు.

సమయానికి మరిగించడం ముఖ్యం
పాలను డెయిరీ లేదా షాపు నుండి తెచ్చిన వెంటనే మరిగించడం చాలా అవసరం. పాలను రవాణా చేసే సమయంలో లేదా నిల్వ ఉంచినప్పుడు అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. మరిగించడం వల్ల ఈ హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. వేసవిలో పాలను రోజుకు రెండుసార్లు (ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి) మరిగించడం వల్ల అవి విరిగిపోకుండా ఉంటాయి.

సరైన నిల్వ పద్ధతులు
మరిగించిన పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రిజ్లో పెట్టాలి. వేడి పాలను నేరుగా ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత మారి ఇతర ఆహార పదార్థాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. పాలను ఫ్రిజ్ డోర్ వైపు ఉన్న అరల్లో కాకుండా, లోపలి భాగంలో అత్యంత చల్లగా ఉండే చోట ఉంచాలి. ఎందుకంటే ఫ్రిజ్ తలుపు తరచుగా తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి పాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

పరిశుభ్రత , పాత్రల ఎంపిక
పాలను మరిగించడానికి , నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన, పొడిగా ఉన్న పాత్రలనే వాడాలి. పాత్రలో కొద్దిగా తేమ లేదా పాత పాల అవశేషాలు ఉన్నా, అవి కొత్త పాలను త్వరగా విరిచేస్తాయి. పాలను మరిగించడానికి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉత్తమమైనవి, ఎందుకంటే వాటిని శుభ్రం చేయడం సులభం. పాలు విరిగిపోతాయనే అనుమానం ఉన్నప్పుడు, మరిగించే ముందు అందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా (వంట సోడా) కలపాలి. ఇది పాలలోని ఆమ్లత్వాన్ని తగ్గించి, పాలు విరిగిపోకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండేలా చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana